సౌత్ సినిమాలకు ‘పాన్-ఇండియా’ అనే ముద్ర వేయడంపై నాచురల్ స్టార్ నాని అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందీ సినిమాలు దేశవ్యాప్తంగా ఆడినా వాటిని ‘హిందీ చిత్రాలు’గానే పిలుస్తారని, కానీ సౌత్ సినిమాలు వేరే భాషల్లో విజయం సాధిస్తే మాత్రం ‘పాన్-ఇండియా’ అని లేబుల్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తమిళ సినిమా, మణిరత్నం మరియు తన కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ విశేషాలను పంచుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన రాబోయే చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా గురువారం చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడారు. తన సినిమాలను ‘పాన్-ఇండియా’ అని పిలవడానికి ఎందుకు ఇష్టపడరో వివరిస్తూ..ఒక హిందీ సినిమా దక్షిణాదిలో విజయం సాధిస్తే, దాన్ని మనం ఇప్పటికీ ‘హిందీ సినిమా’ అనే పిలుస్తాం. కానీ ఒక సౌత్ సినిమా దేశవ్యాప్తంగా విజయం సాధిస్తే మాత్రం దాన్ని ‘పాన్-ఇండియా సినిమా’ అంటారు. అందుకే నా సినిమాలకు ‘పాన్-ఇండియా’ అనే లేబుల్ తొడగడం నాకు ఇష్టం ఉండదు అన్నారు.
కేవలం వేరే భాషా ప్రేక్షకులను ఆకట్టుకున్నంత మాత్రాన ప్రాంతీయ సినిమా ఏదో వింత సాధించినట్లు లేబుల్స్ వేయడం కంటే, కథనంలోని బలం ఆధారంగానే సినిమాల గురించి చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళ సినిమా నాకు బైబిల్ లాంటిది…చెన్నైతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాని భావోద్వేగానికి లోనయ్యారు.
తమిళ సినిమా నాకు బైబిల్ లాంటిది. సినిమాపై నాకున్న జ్ఞానం, ప్రేమ, ఆసక్తి ఇక్కడి నుంచే మొదలయ్యాయి. కమల్ సర్, మణిరత్నం సర్, భారతీరాజా సర్, భాగ్యరాజ్ సర్ లాంటి మహానటులు, దర్శకులను చూసే నేను సినిమాను అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను…నేను చెన్నైలో అడుగుపెట్టినప్పుడల్లా సొంత ఇంటికి వచ్చినట్లే అనిపిస్తుంది. మొదటి రోజు నుంచే ఇక్కడి ప్రజలు నన్ను తమ ఇంట్లోని మనిషిలా ఆదరించారు. నాకూ, ఈ నగరానికి మధ్య ఏదో తెలియని పూర్వజన్మ బంధం ఉంది అన్నారు.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్
నేను రెండు తమిళ సినిమాలు చేశాను, కానీ దురదృష్టవశాత్తూ అవి ఆడలేదు. అయితే, నా తెలుగు సినిమాలు తమిళంలోకి డబ్బింగ్ అయినప్పుడు ఇక్కడి ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో తమిళంలో ఒక మంచి సినిమా చేయాలని ఉంది. ముఖ్యంగా దర్శకుడు మణిరత్నంతో పనిచేయడం నా డ్రీమ్ అని వెల్లడించారు.

