కోలీవుడ్ సూపర్‌స్టార్ ధనుష్ జానర్‌తో సంబంధం లేకుండా ఏ పాత్రలోనైనా రాణించగలిగే అద్భుతమైన నటుడు. అంతే కాకుండా తన బహుముఖ ప్రజ్ఞ, వెర్సటైల్ యాక్టింగ్‌తో దేశంలోనే ఉత్తమ నటులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ ప్రస్తుతం తన కెరీర్‌లో బెస్ట్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. అలాగే తొలిచిత్రంతోనే నేషనల్ అవార్డ్ సాధించిన సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మంచి విలువలుతో కూడిన చిత్రాలను తెరకెక్కిస్తూనే కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌లు అందుకోవడంలో శేఖర్ కమ్ముల మాస్టర్.
ప్రస్తుతం అగ్ర శ్రేణిలో ఉన్న ధనుష్ మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) పతాకంపై ప్రొడక్షన్ నెం. 4గా భారీ స్థాయిలో తెరకెక్కుతోన్నది. ఈ చిత్రానికి నారాయణ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు.
ఏషియన్ గ్రూప్ – ఫిల్మ్ ఎగ్జిబిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతూ అద్భుతమైన కంటెంట్-ఆధారిత చిత్రాలను రూపొందిస్తోంది. ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని సినిమాలు నిర్మించబోతోంది. సోనాలి నారంగ్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఈ రోజు దివంగత సునితా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్నతమైన నటులు, టెక్నీషియన్స్ తో చర్చలు జరుపుతోంది చిత్ర యూనిట్. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
తారాగణం: ధనుష్
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి
నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూరు రామ్మోహన్‌రావు
పిఆర్ఓ : వంశీ – శేఖర్