నీటమునిగిన హైదరాబాద్…

198
hyderabad
- Advertisement -

హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో జోరువాన కురవడంతో ప్రధాన రహదారుల్లో నీరు ఏరులైపారాయి. సాయంత్రం ఆరు గంటల నుండి హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్‌లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.ఓపెన్‌ నాలాలు పొంగి పోతున్నాయి. నాలాలకు పక్కనున్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. వృక్షాలు కూలిపోయి విద్యుత్‌ వైర్లపై పడటంతో అక్కడక్కడ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

హైదరాబాద్‌– వరంగల్, హైదరాబాద్‌ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయ్యాయి. నాగోలు బండ్లగూడ, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌లో ఇటీవల మునిగి ఈ రోజే కాస్త ఉపశమనం పొందిన కాలనీలు, ఇళ్లలోకి శనివారం రాత్రి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది.

ఘట్కేసర్, ఫిర్జాదిగూడ, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఉప్పల్‌ నుంచి చిలుకానగర్‌ వైపు వెళ్లే రోడ్డులో కావేరీనగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో వరదతో పాటు ఇళ్లల్లోకి చేరిన బురదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఈ వర్షం మరింత ఆందోళనకు గురిచేసింది.

ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వస్తుండటంతో శనివారం రాత్రి 9 – 10 గంటల మధ్యలో మూడు గేట్లు ఎత్తి వేశారు. వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

- Advertisement -