రాజధానిలో ఆకాశం భల్లున బద్దలైందా అన్నట్లుగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆకాశం చిల్లుపడిందా అన్నట్లుగా 13 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. గత పదేళ్లలో అక్టోబరు నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. మీరాలంలో 13.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.6, అంబర్‌పేట 12.03, గోల్కొండ 10.4, మోండా మార్కెట్‌లో 10.4 సెం.మీ. వర్షం కురిసింది. అంతకు ముందు 2013 అక్టోబరు 10న 9.8 సెం.మీ.ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. విద్యుత్ తీగ పడి ఒకరు మృతి చెందగా మట్టి గోడ కూలి తండ్రీ కుమారుడు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు వేర్వేరు ఘటనల్లో తల్లీకొడుకులు నలుగురు చనిపోయారు. నగరంలో దాదాపు 300 కాలనీలు, రెండు వందల కూడళ్లు వరద ముంపులో ఉన్నాయి. దాదాపు పది వేల ఇళ్లలోకి వాననీరు చేరిందని అంచనా. వర్షతీవ్రతపై సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సహా సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
నగరంలో ఒక్కసారిగా వచ్చిన వరదతో రహదారులు, నాలాలు పొంగిపొర్లాయి. చెరువులు నిండి కాలనీలు, రహదారుల్లోని వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. సెల్లార్లు సెప్టిక్ ట్యాంకులుగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ వరద నీట మునిగిపోయాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. వరదనీటిని దాటే ప్రయత్నంలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్య తీవ్రమై రాకపోకలకు గంటల తరబడి అంతరాయం కలిగింది. అర్ధరాత్రి వరకూ ఇదే పరిస్థితి. ముషీరాబాద్, కాప్రాలలో 9.5 సెం.మీ., నారాయణగూడ 9.3, విరాట్‌నగర్ 9.2, సైదాబాద్ 9.1, బండ్లగూడ 8.9, ఎల్.బి.నగర్‌లో 8.4, చార్మినార్‌లో 7.6, అమీర్‌పేటలో 7.5 సెం.మీ.వర్షం కురిసింది.
నగరంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నగర పరిస్థితిపై సోమవారం రాత్రి ఆయన ప్రగతిభవన్‌లో సమీక్షించారు. మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డితో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రాత్రంతా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అధికారయంత్రాంగం వెంటనే స్పందించాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని సీఎం సూచించారు.