తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

152
Floods

తెలంగాణ‌లో గత కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ప‌లు ప‌ట్ట‌ణాలు, కాల‌నీలు, గ్రామాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్ల‌డంతో ర‌హ‌దారులు తెగిపోయాయి. దీంతో ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఇండ్ల‌లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చి చేర‌డంతో.. బియ్యంతో స‌హా ఇత‌ర వ‌స్తువులు పూర్తిగా త‌డిసిపోయాయి.

కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. దీంతో వినాయక చవితి కోసం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన విగ్రహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి.

మరోవైపు, బోనాల చెరువు కట్ట ప్రమాదకరంగా మారడంతో ప్రజలు భయపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, శాతవాహన వర్సిటీలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు, కలెక్టరేట్‌లోకి నీరు వచ్చి చేరడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు.ఇక రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.