తెలుగు చిత్రసీమలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, స్వయంకృషితో ‘మెగాస్టార్’గా ఎదిగిన కొణిదెల చిరంజీవి సినీ రంగప్రవేశం చేసి 48 వసంతాలు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ప్రారంభమైన ఆయన నట ప్రయాణం దిగ్విజయంగా ఐదు దశాబ్దాల దిశగా కొనసాగుతోంది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న నూతన చిత్రం ‘కాకా’ షూటింగ్ సెట్‌లో చిత్ర బృందం ఘనంగా వేడుకలను నిర్వహించింది.
దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే 48 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ మెగాస్టార్‌కు ఊహించని రీతిలో గ్రాండ్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
చిరంజీవి సెట్‌లోకి అడుగుపెట్టగానే ఆయనపై 48 ఏళ్ల మధుర ప్రయాణానికి గుర్తుగా పూల వర్షం కురిపించారు.ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రాండ్ కేక్‌ను చిరంజీవితో కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ, నిర్మాతలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొని చిరుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read:చాలా డిఫరెంట్‌గా ‘ది ప్యారడైజ్’
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు.48 ఏళ్ల క్రితం ‘చిరంజీవి’ అనేది నేను పెట్టుకున్న ఒక పేరు మాత్రమే.. కానీ ఈ రోజు మీ ప్రేమాభిమానాలతో అది నా శాశ్వతమైన గుర్తింపుగా మారింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మిన నిర్మాతలు, నన్ను కొత్తగా ఆవిష్కరించిన దర్శకులు, నాతో పని చేసిన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు.

