వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్!

369
- Advertisement -

మనం రోజూ తినే తిండిలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ‘లో డెన్సిటీ లిపొప్రొటైన్’ (ఎల్.డి.ఎల్) అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది పసుపు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

యాలకులతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమై శరీరానికి తగినంత జీవశక్తిని ఇస్తుంది. యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును సైతం తొలగించే శక్తి యాలకులలో ఉంది.

మిరపకాయలోని క్యాప్‌సైసిన్ క్యాలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. క్యాలరీలు తొందరగా ఖర్చయ్యేకొద్దీ కొలెస్ట్రాల్ పెరగదు. బరువు తగ్గించేందుకు కరివేపాకులు చాలా కష్టపడతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును ఊడ్చేస్తాయి ఇవి. కూరల్లో కలిపి తిన్నా సరే, లేకపోతే రోజూ పది కరివేపాకులతో జ్యూస్ చేసుకొని తాగినా మంచిదే.

వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని ‘ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్’ అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. సన్‌ఫ్లవర్, గ్రౌండ్‌నట్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే దీని ఖరీదు ఎక్కువ. అయినా అన్ని నూనెలకంటే ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి.

బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని వండుకుతినే వాళ్లలో కొలెస్ట్రాల్ మోతాదు కూడా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా, ఉడికించిన క్యాబేజీ కూరలు తింటేనే శరీరానికి ఎంతో మేలు.

కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితోపాటు విటమిన్ ఎ, బి, సి, ఇ, ప్రొటీన్లు, ఫైబర్ దానిలో ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువ. కందిపప్పు మోజులో పడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే పెసరపప్పు తినడం తగ్గించొద్దు.

మధురమైన రుచిని మాత్రమే కాదు, ఒబేసిటీని తగ్గించి, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని అందిస్తుంది తేనె. రోజూ ఉదయం పూట వేడి నీళ్లలో పది చుక్కల తేనె కలుపుకొని తాగితే చురుగ్గా ఉంటారు.

Also Read:ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న!

గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 క్యాలరీలు దొరుకుతాయి. అదే పాలలో అయితే 8.9 గ్రాముల కొవ్వు 157 క్యాలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి, ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగలో ఉన్నాయి. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.

అత్యధిక ఫైబర్ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందు వరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే కొవ్వు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

చెక్కా, లవంగాలు ఈ రెండూ లేకుండా మసాలా వంటలుండవు. భారతీయ సంప్రదాయ వంటకాల్లో చెక్కా లవంగాల వాడకం ఈనాటిది కాదు. వీటిలోని ఉత్తమ ఔషధ గుణాలు డయాబెటీస్, కొలెస్ట్రాల్‌ల సమస్యలు రాకుండా చేస్తాయి. ఎల్.డి.ఎల్., ట్రైకోగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. చక్కటి ఆరోగ్యంతో సుఖమైన జీవితం గడపవచ్చు.

- Advertisement -