రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య

258
Narayana
- Advertisement -

పుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, సహాజ నటి జయసుధ జంటగా నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సంక్రాంతి సందర్బంగా జనవరి 14న విడుదలైంది. నారాయణ మూర్తి ఫస్ట్ టైం ఓ కమర్షియల్ ఫార్మాట్‌ లో నటించిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే నెలకొన్నాయి.  ట్రైలర్ కూడా బాగుండటంతో ఈ చిత్రంపై అందరి దృష్టీ పడింది. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

లంచాలు తీసుకొకుండా, నమ్మిన సిద్దాంతికి కట్టుబడి ఉండే నిజాయితీ గల ఓ హెడ్ కానిస్టేబుల్ కథే ఈ సినిమా ప్రధాన స్టోరి. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య(నారాయణమూర్తి) ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎవరి దగ్గరా రాజీ పడకుండా, లంచాలు తీసుకొకుండా నమ్మిన నీతికి కట్టుబడి డ్యూటీ చేస్తుంటాడు. కానీ అతని సహచర పోలీసులు మాత్రం ఆయన్ను ఎప్పుడెప్పుడు అణగదొక్కుదామా అని చూస్తుంటారు. దానికి తోడు ఆయన భార్య పద్మ (జయసుధ) కూడా అతన్ని లంచాలు తీసుకుని డబ్బు సంపాదించామని గోల పెడుతూ ఉంటుంది. అయినా కూడా వెంకట్రామయ్య దేనికీ లొంగడు. అలా ఒక హోమ్ మంత్రి దగ్గర డ్యూటీ చేస్తున్న అతన్ని ఆ హోమ్ మంత్రి వ్యక్తిగత కక్షతో అవినీతి కేసులో ఇరికించి అవమానిస్తాడు. అదే టైమ్ లో అతని భార్య కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. అలా జీవితంలో దెబ్బతిన్న వెంకట్రామయ్య నల్లధనమే సమాజానికి చేటని, ఎలాగైనా దాన్ని అంతం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంటాడు. అసలు హోమ్ మంత్రి వెంకట్రామయ్యను  ఎందుకు టార్గెట్ చేస్తాడు ? నల్లధన నిర్మూలనకు వెంకట్రామయ్య ఏం చేశాడు ? వెంకట్రామయ్య భార్య అతన్ని అపార్థం చేసుకుని ఎలా బాధపెట్టింది ? అనేదే ఈ సినిమా కథ.

Venkatramaih

ప్లస్ పాయింట్స్ :
ఆర్. నారాయణమూర్తి నటనే సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి సినిమా మొత్తాన్ని తన నటనతోనే లాక్కొచ్చే ప్రయత్నం చేసి మెప్పించాడు. పోలీస్ పాత్రలో నిజాయితీని, ధైర్యాన్ని, మంచితనాన్ని, బాధని, బాధ్యతని ప్రదర్శించే సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకునేలా ఉంది. నారాయణ మూర్తికి జయసుధకు మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. వారిద్దరి మధ్య నడిచే సరదా, ఘర్షణ సన్నివేశాలు కొన్ని బాగున్నాయి. నిజాయితీ పేరు మీద ఇప్పటికే చాలా సినిమాలే  వచ్చినా.. ఈ సినిమా స్టోరీ కాస్త కొత్తగా ఉంది. ఫస్టాఫ్ అంతా వెంకట్రామయ్య పాత్రను ఎలివేట్ చేస్తూ కొంచెం ఆకట్టుకుంది. సుధాకర్ రెడ్డి ఫోటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా తయారు
చేసింది.

మైనస్ పాయింట్స్ :

మైన్స్ పాయింట్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథ బలంగానే ఉన్నా..దాన్ని ప్రేక్షకులకు రక్తి కట్టించేలా చూపించలేక పోయారు. ముఖ్యంగా సినిమాకు కీలకమైన రెండో పార్ట్ ను ఆకట్టుకునేలా ముగించలేకపోయారు. అందులోని ప్రతి అంశం చాలా సిల్లీగా ఉంది. వెంకట్రామయ్య, అతని భార్య ఒకరికొకరు ప్రత్యర్థులుగా మారడం, అవినీతి హోమ్ మంత్రి ఎలాంటి ఇమేజ్ లేని వెంకట్రామయ్య భార్యను అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించి తన పార్టీని గెలిపించుకోవాలనుకోవడం, ఆమెనే ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం వంటివి మరీ ఓవర్ గా అనిపిస్తాయి. ఇక మధ్యలో వచ్చే పాటలు, బోర్ కొట్టించాయి. ఇక కథలో మనిషి జీవితం నుండి డబ్బును దూరం చేస్తే అవినీతి తగ్గుతుందని చెప్తారు కానీ దాన్ని చూపించకుండానే సినిమాను ముగించడం తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. అలాగే మొదటి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఒక సాధారణ కానిస్టేబుల్ గ్రౌండ్ వర్క్ చెయ్యకుండా, జనాల్లోకి సరిగా వెళ్లకుండా సింపుల్ గా పార్టీ పెట్టేసి సీఎం అభ్యర్థిగా పోటీ చేసేయడం కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఈ పొరపాట్లన్నీ కలిసి సెకండాఫ్ లో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాయి.

సాంకేతిక విభాగం :
ప్రస్తుత ఆర్ధిక, సామాజిక పరిస్థితులకు తగ్గట్టు మెసేజ్ ఉన్న కథ చెప్పాలనుకోవడం బాగానే ఉన్నా.. దానికి తగిన బలమైన, ఆకట్టుకునే కథనాన్ని రాసుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా సినిమా సెకండాఫ్ ను సిల్లీ సిల్లీగా తీశారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం పెద్డగా ఆకట్టుకోలేదు. మోహన్ రామారావు ఎడిటింగ్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. చదలవాడ పద్మావతి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ప్రజా సమస్యలపై సినిమాలు చేస్తూ పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణ మూర్తి..అదే తరహాలో తాజా పరిస్థితులకు అనుగుణంగా చేసిన మరో ప్రయత్నమే ఈ ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. కాస్త కొత్తగా ఉండే కథ, నారాయణ మూర్తి, జయసుధల నటన, సినిమాను పర్వాలేదనిపించాయి. వాస్తవానికి దూరంగా..లాజిక్ లేని సెకండాఫ్ కథనం ఇందులో మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. సెకండాఫ్‌తో సినిమా స్థాయి కాస్త తగ్గిందని చెప్పోచ్చు.  మొత్తానికి  ఫర్వాలేదనిపించే సోషల్ మెసేజ్ సినిమా.

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 14, 2017
రేటింగ్ : 2/5
దర్శకత్వం : చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు
నిర్మాతలు : చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

- Advertisement -