కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు!

3
- Advertisement -

రాష్ట్రంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడి ప్రకృతి ప్రసాదించిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరంకుశత్వం వల్ల ఏర్పడిన ‘కృత్రిమ కరువు’ అని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్కలు పూర్తిగా వాస్తవ దూరమని హరీష్ రావు విమర్శించారు. శ్రీశైలం నుంచి ఏకంగా 84 టీఎంసీల నీటిని వినియోగించామని మంత్రి చెబుతున్నారని, కానీ వాస్తవానికి అక్కడ నుంచి లిఫ్ట్ చేసింది కేవలం 8 టీఎంసీలు మాత్రమే అని హరీష్ రావు స్పష్టం చేశారు.

శ్రీశైలం నుంచి నీటిని తోడేందుకు తెలంగాణకు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ కల్వకుర్తి మాత్రమేనని గుర్తుచేశారు. ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మోటార్లను ఆన్ చేయడం లేదని ఆరోపించారు. రోజుకు 24 గంటల పాటు నడవాల్సిన మోటార్లను కేవలం 10 గంటలు మాత్రమే ఎందుకు నడుపుతున్నారని, పూర్తిస్థాయిలో 5 మోటార్లు నడవాల్సి ఉండగా కేవలం 2 మోటార్లకే ఎందుకు పరిమితం చేశారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

కృష్ణా నది నీటి వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి గణాంకాలకు అస్సలు సంబంధం లేదని సిడబ్ల్యూసి (CWC) లెక్కలను ఉటంకిస్తూ హరీష్ రావు వివరించారు. “కృష్ణా నదిలో అత్యధిక నీటి వినియోగం తమ హయాంలోనే జరిగిందని మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ CWC అధికారిక లెక్కల ప్రకారం కృష్ణా జలాల్లో అతి తక్కువ నీటిని వాడుకున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని స్పష్టమవుతోంది.”

కృష్ణా జలాల్లో తెలంగాణకు చట్టబద్ధంగా 36% వాటా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పాలనలో కేవలం 28.4% నీటిని మాత్రమే వాడుకోగలిగారని విమర్శించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 71.5% నీటిని తరలించుకుపోయిందని తెలిపారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎప్పుడూ తన వాటాలో 35 శాతానికి తగ్గకుండా నీటిని సమర్థవంతంగా వినియోగించుకుందని, కానీ ప్రస్తుత ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతాంగానికి సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సమర్థవంతమైన నీటి నిర్వహణ లేకపోవడం వల్లే తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇప్పటికైనా ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం మానేసి కల్వకుర్తి సహా అన్ని ఎత్తిపోతల పథకాల మోటార్లను పూర్తిస్థాయిలో నడిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -