టీఆర్ఎస్‌తో సంక్షేమం..మహాకూటమితో సంక్షోభం

290
harishrao trs
- Advertisement -

సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో జహీరాబాద్‌కు చెందిన బీజేపీ,కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…బీజేపీ,మహాకూటమి నేతల వైఖరిని ఎండగట్టారు.

తెలంగాణలో బీజేపీ కనుమరుగవుతోందని..రోజుకో నేత ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సిద్దాంతాలను పక్కనపెట్టి విపక్షాలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. మహాకూటమి అధికారంలోకి వస్తే సంక్షోభం వస్తుందని…టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమంలో ముందుంటామన్నారు. సంక్షేమమా….సంక్షోభమా ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారని దుయ్యబట్టారు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే …ఆ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు..ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆరోపించారు. నాడు తెలంగాణలో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైందని…నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు పదవులకే ముఖ్యమని ప్రజలు ముఖ్యం కాదని తెలిపారు. టీజేఎస్ పేరుతో కోదండరాం..చంద్రబాబు వద్ద మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది స్ధానాలు టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -