టీఆర్ఎస్‌లోకి మాజీమంత్రి జలగం ప్రసాదరావు

256
trs jalagam prasadarao
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి జలగం ప్రసాదరావు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. నవంబర్ 3న హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో కారెక్కనున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలంలోని తుమ్మలపల్లిలో తన నివాసంలో అనుచరులతో ప్రసాదరావు సమావేశమైన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఖమ్మం రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు జలగం ప్రసాదరావు. కాంగ్రెస్‌ కోసం కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని… సస్పెన్షన్‌ గడువు ముగిసినా పార్టీలోకి తీసుకోకుండా అవమాన పర్చారని తెలిపారు. మంత్రి కేటీఆర్‌,తుమ్మల నాగేశ్వరరావుల ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జలగం ప్రసాదరావు 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్‌టీఆర్‌ ప్రభంజనంలోనూ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచారు. 1989 ఎన్నికల్లో  ఎన్‌టీఆర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావుపై  విజయం సాధించారు.

jalagam prasada rao

నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కేబినెట్‌లో రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా, అంతకు ముందు లఘుపరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన, కాంగ్రెస్‌ పార్టీని ఒంటిచేత్తో నడిపించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో సత్తుపల్లి సీటు పొంగులేటి సుధాకర్‌రెడ్డికి కేటాయించడంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారని  ఆరు సంవత్సరాల పాటు ప్రసాదరావుని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ ముగిసిన తర్వాత జలగం ప్రసాదరావు అనేకసార్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని, పార్టీ ఆయన సేవలను వినియోగించుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆయన గులాబీ గూటికి చేరేందుకే ముహుర్తం ఖరారు చేసుకున్నారు.

- Advertisement -