కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో కాలువల నిర్మాణానికి గాను అవసరమైన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ లో కాళేశ్వరం కాలువ పనులపై జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ కాలువ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో కాలువ పనులకు అవసరమైన భూ సేకరణ త్వరగా సేకరించాలని, నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అధికారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరిత గతిన పూర్తి కావాలని స్పష్టం చేశారు.
అధికారులందరు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు. మే నెల 15వ తేదీ వరకు కొండపోచమ్మ రిజర్వాయర్ కి సంబంధించి పనులన్నీ పూర్తి కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుందని, కాలువ కింద ఉన్న ఆనకట్టలు అన్ని కూడా త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.