సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చేయడంతోనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ నిరంతరం డిమాండ్ చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేసినప్పటికీ, ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని విమర్శించారు. క్వింటాల్‌కు రూ. 2400 వరకు మద్దతు ధర ఉన్నప్పటికీ, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ. 1600 నుంచి 1700లకే అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
Also Read;Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే 20 నుంచి 25 శాతం వరకు మొక్కజొన్న దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని అన్నారు. రైతులకు సూచిస్తూ, దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే తమ పంటను అమ్ముకుని పూర్తి మద్దతు ధర పొందాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

