కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది. దానికి కారణం చిరంజీవికి చిన్నల్లుడు కావడమే. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఏ హీరో వచ్చినా కూడా చిరు ముందుండి అవకాశాలు ఇప్పించడం కానీ.. రాయబారాలు చేయడం కానీ చేయలేదు. అలాంటి అవసరం కూడా రాలేదు. దాదాపు అంతా తమ సొంత టాలెంట్ తోనే వచ్చారు. మొదట్లో కాస్త బూస్టప్ ఇచ్చినా.. అంతా మాస్ ఇమేజ్ సంపాదించుకుని స్టార్స్ అయ్యారు.
అయితే ఇప్పుడు చిన్నల్లుడి విషయంలో మాత్రం చిరు చొరవ తీసుకోక తప్పడం లేదు. కూతురు కోసం అల్లున్ని ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే ఇతడి తొలి సినిమా కోసం తన విజేత టైటిల్ ఇచ్చాడు చిరు. కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా సాయి కొర్రపాటి నిర్మాణంలో ‘విజేత’ సినిమా రూపొందింది. ఈ సినిమాను వచ్చేనెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.
విజేత సినిమా విడుదల కాకముందే ఈ మెగాహీరో మరో సినిమాకు పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. పెద్దగా గ్యాప్ రాకుండా రెండవ సినిమా షూటింగ్ మొదలు కావాలనే ఆలోచనలో మెగా ఫ్యామిలీ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఈ రెండవ సినిమాకి దర్శకుడిగా హరీశ్ శంకర్‌ను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు ఆల్రెడీ హరీశ్ శంకర్‌కి ఈ విషయం తెలియడం .. ఆయనతో చర్చలు జరగడం పూర్తయ్యాయని అంటున్నారు. కల్యాణ్ దేవ్ కోసం కథ రెడీ చేసే పనిలోనే హరీశ్ వున్నాడని అంటున్నారు. ఇంతకుముందు హరీశ్ శంకర్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో బన్నీకి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథతో చిరూను ఎంతవరకూ ఒప్పిస్తాడో చూడాలి మరి.