ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్‌లు బస్తీ దవఖానాలుగా మార్పు: హరీశ్‌

79
harish
- Advertisement -

దసరా నుండి ఏఎన్ఎం స‌బ్ సెంట‌ర్ల‌ను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ శ్రీనివాసరావులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా స్థానిక నేషనల్ గార్డెన్‌లో నిర్వహించిన ఆశా సమ్మేళన కార్యక్రమంలో మంత్రి హ‌రీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక దశలో ప్రజల అనారోగ్య పరిస్థితిని గుర్తించి చికిత్స అందజేయాలని మంత్రి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ ప్రభుత్వం చేయూతనిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో, వాక్సినేషన్ విషయంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తోపాటు సీనియర్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని మంత్రి కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని గుర్తు చేస్తూ… గతంలో ప్రభుత్వ ఆస్ప‌త్రులలో సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందుల పాలు అయ్యారని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 66 శాతానికి పెరిగిందన్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో 80 శాతం ప్రసవాల సంఖ్య పెరగడం అభినందనీయమని మంత్రి అన్నారు. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఆస్పత్రులలో కంటే ప్రభుత్వ హాస్పిట‌ల్లో ప్రసవాల సంఖ్య పెరగడం దీనికి ఉదాహరణ అని మంత్రి తెలిపారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సేవ మరువలేనిదని, వారి సేవలు అభినందనీయమని మంత్రి అన్నారు. ఆశా వర్కర్లు విశేషమైన సేవలందిస్తూ అమ్మ పాత్రను నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లుగా ప్రస్తుతం కూడా గ్రామాలలో ప్రతి ఇంటింటికి వెళ్లి బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా తాండూరులో ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు మంత్రి హ‌రీశ్‌రావు చీరల పంపిణీ చేశారు. మంత్రి పర్యటనలో భాగంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన పేషంట్ అటెండర్ క్యాంటీన్, రూ. 90 లక్షల వ్యయంతో గంగోత్రి పాఠశాల సమీపంలో చేపట్టే సీసీ రోడ్డు, రైతు బజారులో రూ. 4.50 కోట్ల వ్యయంతో చేపట్టే సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పాత తాండూరులో బస్తీ దవాఖాన భవనాన్ని ప్రారంభించారు.

- Advertisement -