తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏడేళ్లలో తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందని చెప్పారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. సమస్యలను, సవాళ్లను అధిగమిస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ర్టంలో సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి కావోస్తోంది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్‌లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం.. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు నీరందించామన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి అవసరాల కోసం తలపెట్టిన డిండి ఎత్తిపోతల త్వరలోనే పూర్తవుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన తుపాకుల గూడెం దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టులో భాగమైన దుమ్ముగూడెం బ్యారెజీ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాగునీటి సదుపాయాన్ని మరింత పెంచే లక్ష్యంతో అనేక కొత్త లిఫ్టులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు మంత్రి హరీష్.