జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి మండలం లింగంపల్లి వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సర్వే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాఠిల్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, మండలి ప్రోటెం ఛైర్మన్ భూపల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మంజు శ్రీ జైపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 మండలాల్లో 2 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. 60 నుంచి 70 రోజుల్లోనే డీపీఆర్ తయారు చేయాలని అధికారులను కోరుతున్నాం. జహీరాబాద్ సముద్రమట్టానికి 665 మీటర్ల ఎత్తులో ఉంది. కాళేశ్వరం నీరు కర్ణాటక సరిహద్దు గ్రామాలకు చేరుతుందన్నారు.
ఒక్క యాసంగిలోనే 90 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే ధాన్యపు భాండాగారంగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ అవుతుందని స్పష్టం చేశారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రైతుబంధు ఆపలేదని స్పష్టం చేశారు. ఒకప్పుడు మెదక్ జిల్లా కరువు జిల్లాగా ఉండేది. ఈ ప్రాంత పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.