యాదవులు ఎటువైపు ఉంటే అటు విజయం తథ్యమని, న్యాయం, ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ యాదవులు ఉంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కు మద్దతుగా యాదవులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ యాదవులు పక్షపాతిగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, గత ప్రభుత్వాల హాయాంలో ఏ ముఖ్యమంత్రి యాదవుల గురించి ఆలోచించలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే యాదవుల పక్షాన ఆలోచించారని మంత్రి హరీష్ రావు అన్నారు.
తమ పార్టీకి ప్రజల హైకమాండ్ అని, ప్రతి ఊళ్లో అంగన్‌వాడీ భవనాలు, స్కూళ్లు నిర్మించామని, అభివృద్ధిలో గజ్వేల్ 30ఏండ్లు ముందుకు పోయిందని, గజ్వేల్ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని, యాదవులకు రాజ్యాధికారంలో వాటా దొరికిందని, యాదవ భవనం కోసం ఐదు ఎకరాల భూమి, రూ.5కోట్ల నిధులు కేటాయించామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనపడడం లేదని, వాళ్లు కళ్లుండి అభివృద్ధిని చూడలేకపోతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు కంటివెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకోవాలని, . గజ్వేల్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం నంబర్‌వన్‌గా నిలిచిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
టీఆర్‌ఎప్ పాలనలో కాల్వల్లో నీళ్లొస్తున్నాయ్.. చెరువులు నిండినయ్.. ఇంటింటికి కుళాయి నీళ్లు వస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రతి ఓటు కారుకు.. కేసీఆర్‌కు వేయాలి. ఐదు నిమిషాలు ఆలోచించి కారు గుర్తుకే ఓటేస్తే.. మీకోసం ఐదేళ్లు పనిచేస్తాం. సంగాపూర్‌లో ఆడపిల్లలు చదువుకునేందుకు గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మించాం. మగపిల్లలు చదువుకునేందుకు బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మించాం. సంగాపూర్ కాస్త సింగపూర్ అయిందని ఆ గ్రామస్థులు సంతోషపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. 30ఏళ్లు కష్టపడి సిద్ధిపేటను అభివృద్ధి చేస్తే.. గజ్వేల్ మూడేళ్లలోనే సిద్ధిపేటను ఓవర్‌టేక్ చేసిందని హరీశ్ వివరించారు.