కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు పూటకో మాట్లాడుతున్నారని, వారిది పార్లమెంట్‌లో ఓ మాట ప్రజాక్షేత్రంలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మేడ్చల్‌లో 50 పడకల ఎంసీహెచ్ దవాఖానకు హరీశ్‌రావు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గజేంద్ర సింగ్ షెకావత్ అనే కేంద్ర మంత్రి వచ్చిండు.. ఆయనది ఢిల్లీలో ఓ మాట.. పార్లమెంట్‌లో ఓ మాట అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో పద్దెనిమిదన్నర లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని లేదని పార్లమెంట్‌లో చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. బీబీనగర్‌లో కేంద్రమంత్రి కాళేశ్వరానికి అనుమతులు లేవంటాడని, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ లేదంటున్నాడని, అవినీతి జరిగిందంటున్నాడని ధ్వజమెత్తారు. ఐదు నెలల కిందట పార్లమెంట్‌లో ఏం చెప్పారు? ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు ఉన్న కాగితాలు తెచ్చా.. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని అనుమతులు ఇచ్చిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి మూడు నెలల కిందట శంషాబాద్ వచ్చిండని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ అన్నాడని, దీంతో తెలంగాణ సస్య శ్యామలం అన్నాడని గుర్తు చేశారు. ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని, వంద అబద్దాలు ఆడి పెళ్లి చేయాలన్నారు కానీ.. బీజేపీ వాళ్ల కథ వంద అబద్ధాలు ఆడి అయినా అధికారంలోకి రావాలన్నట్లుగా ఉందని విమర్శించారు. మోదీ ఉచితాలు వద్దు అంటున్నడని, రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్, ఉచితంగా 5లక్షల బీమా వద్దంటున్నడని.. పేద మహిళలకు ఆసరా పెన్షన్ 2016 వద్దంటున్నరా? అని ప్రశ్నించారు. పేదలకు ఉచిత పథకాలు వద్దంటూ బడా కంపెనీలకు 12లక్షల కోట్ల రుణాలు కేంద్రం రద్దు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఎవరు పేదల కోసం పని చేస్తున్నారు? ఎవరు బడా బడా పారిశ్రామికవేత్తల కోసం పని చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.
కేంద్రం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ 2017, 22 డిసెంబర్ ఇచ్చిందని, అటవీ శాఖ అనుమతి 2017, నవంబర్ 24న వచ్చిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అనుమతి ఇచ్చేది వాళ్లేనని.. ఇక్కడకు వచ్చి అనుమతి లేదంటున్నారని.. అది నోరా.. మోరీనా అంటూ మండిపడ్డారు. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో ఓ మాట.. పార్లమెంట్‌లో ఓ మాట.. ప్రజాక్షేత్రంలో ఓ మాట మాటాడుతున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్ లైన్ అని, తెలంగాణకు గొప్ప ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో, శామిర్‌పేట చెరువులో రెండు మూడు నెలల్లో నీళ్లు వస్తాయన్నారు. రావల్ కోల్ కెనాల్ ద్వారా మేడ్చల్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుంటే కళ్లు మండుతున్నాయని ఆరోపించారు.