జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలి..

110
harish

అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలని కోరారు. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్దమైన హక్కని చెప్పారు. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ 24 వేల కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్‌లో జమ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 2638 కోట్లు రావాల్సి ఉందని, ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.

ఈ ఏడాది ఆరు నెలల సెస్ వసూలు చేశారని, రాష్ట్రాలకు చెల్లించాల్సిన మూడు ఇన్స్టాల్ మెంట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మొత్తాన్ని రాష్ట్రాలకు వెంటనే చెల్లించాలని కోరారు. జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే అప్పుగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలని తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని… కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితికి జీఎస్టీ పరిహార చెల్లింపులకు ముడి పెట్ట వద్దు అన్నారు. ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని వెంటనె చెల్లించాలి అని మంత్రి హరీశ్‌ డిమాండ్‌ చేశారు. అదే విధంగా రివర్స్ అండ్ ల్ఫాప్స్ ఐజీఎస్టీ ఐటీసీ కూడా రాష్ట్రాలకు కొద్దికాలంగా ఇవ్వడం‌లేదు. ఇందులో తెలంగాణకు రావాల్సిన వేయి కోట్లు వెంటనే విడుదల చేయాలి తెలిపారు.

వారం రోజుల్లో ఐజీఎస్టీ మొత్తం 24 వేల‌కోట్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.తెలంగాణ, పశ్చిమ బెంగాల్ , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆప్షన్లకు అంగీకరించకుండా జీఎస్టీ పరిహారం మొత్తం‌ కేంద్రమే చెల్లించాలని డిమాండ్ చేయడంతో జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం చేయకుండానే వాయిదా వేయడం జరిగింది. మరింత‌ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించేందుకు ఈ నెల‌ 12 తేదీన మరో మారు సమావేశం ‌కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.