ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఖిల్లా గుజరాత్లో బీజేపీకి గట్టిపోటీనిచ్చి చెమటలు పట్టించిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. గుజరాత్లో గణనీయమైన ఓటు బ్యాంకు కలిగిన పటేల్ సామాజిక వర్గానికి చెందిన గుజరాత్ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారైంది.
మార్చి 12న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటన సందర్భంగా ఆయన అఫిషియల్‌గా కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఇటీవలె రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించిన హార్ధిక్ జామ్‌నగర్ లేదా అమ్రేలి నుండి పోటీచేసుందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
పటేల్ సామాజిక వర్గంలో గట్టిపట్టున్న హార్థిక్ కాంగ్రెస్‌లో చేరికతో ఆ పార్టీకి మరింత బలం చేకూరనుంది. రాహుల్ పర్యటన సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించి కాంగ్రెస్‌లో చేరనున్నారు హార్థిక్.2014 లోక్‌సభ ఎన్నికల్లో హార్దిక్ పోటీ చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో 2019 కోసం స్పష్టమైన ప్రణాళికతో ముందుకువస్తున్నారు హార్థిక్.
గుజరాత్ నుండి బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించే నేతల్లో హార్థిక్ తో పాటు జిగ్నేష్,అల్పేష్ ఠాకూర్ ఉన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిగ్నేష్‌తో పాటు అల్పేష్ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. బనస్కంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేష్ గెలుపొందగా రాదన్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అల్పేష్ ఠాకూర్ విజయఢంకా మోగించారు. తాజాగా హార్థిక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం కావడంతో బీజేపీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.