దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇంటింటిపై ట్రై కలర్ జెండా ఎగురవేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ హర్ ఘర్ తిరంగా ప్రత్యేక గీతాన్ని విడుదల చేసింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి75 ఏళ్లు పూర్తి చేసుకొంటున్న సందర్భంగా మన ఐక్యత గౌరవానికి చిహ్నంగా నిలిచిన మువ్వన్నెల జెండాకు ఈ మధురమైన వందనం అంటూ కేంద్రం ఈ గీతాన్ని రూపొందించింది.
భారతీయ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడుతూ అణువణువునా దేశభక్తి చాటేలా రూపొందించిన ఈ గీతంలో సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హర్ ఘర్ తిరంగా అంటూ తమ గళం కలిపారు. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రభాస్, అజయ్‌దేవగణ్, అక్షయ్ కుమార్, జాకీష్రాఫ్, అనుపమ్‌ఖేర్, వరుణ్ ధావన్, అనుష్క శర్మ, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌తో పాటు ప్రముఖ క్రీడాకారులు కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, నీరజ్ చోప్రా, పీవీ సింధు, మేరీ కోమ్, మీరాబాయి చాను, మిథాలీ రాజ్, పీటీ ఉష తదితరులు జెండా చేత బట్టి హర్ ఘర్ తిరంగా అంటూ పాడారు. ఈ గీతాన్ని ప్రముఖ గాయకులు సోను నిగమ్, ఆశా భోంస్లే ఆలపించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించినట్లు తెలుస్తోంది.