దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు పదిహేనేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్. 2001లో ఎగిరిన గులాబీ జెండా నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా రెపరెపలాడుతుంది. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా…దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే. నేడు తెలంగాణ బాపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.
1954 ఫిబ్రవరి 17న వెంకటమ్మ, రాఘవరావు దంపతులకు మెదక్ జిల్లా చింతమడకలో జన్మించారు కేసీఆర్. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న టీడీపీకి రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2004లో కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. తెలంగాణ కోసం 2006 సెప్టెంబర్ 23న రాజీనామా అస్త్రాన్ని సంధించారు.
తెలంగాణ వచ్చుడో-కేసీఆర్ సచ్చుడో అనే నినాదమిచ్చి ఉద్యమ వేడి రగిల్చారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు వ్యుహాలను పదునుపెడుతు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకుసాగారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఓ మైలురాయిగా నిలిచింది. ఆమరణ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయడంతో ఆస్పత్రిలోనే గులాబీదళపతి దీక్ష చేశారు. దీంతో ఎట్టకేలకు మన్మోహన్ ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు… రాజకీయ చతురత చాటుకున్నారు. రక్తం చుక్క చిందించకుండా తెలంగాణను సాధించుకున్నారు.
2014 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను అధికారంలోకి తేవడంలో తనవంతు పాత్రను పోషించిన కేసీఆర్… జూన్ 2న తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందో ఆయనకు తెలుసు..ఏం చేస్తే తెలంగాణ ప్రజల జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయో తెలుసు..అందుకే ముందుగా విభజనతో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దారు. ఓ పక్క ఉద్యోగుల లేమి, నిధులు లేమి, కరెంట్ కష్టాలు, ఆర్థిక అస్థిరత..అధికారం చేపట్టగానే కేసీఆర్ ముందు ఉన్న సమస్యలు ..అయితే కేసీఆర్ సమర్థతతో,కార్యదక్షతతో అవలీలగా అన్ని సమస్యలను అధిగమించారు.అనతికాలంలోనే కరెంట్ కష్టాలను అధిగమించిన తెలంగాణ నేడు దేశంలో 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది.
అంతేగాదు మిషన్ కాకతీయ,భగీరథ,ప్రాజెక్టుల రీడిజైనింగ్తో బంగారు తెలంగాణ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు అపర భగీరథుడి అవతారం ఎత్తారు.జలదౌత్యంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరిస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ పంటపొలాల్లో బంగారు సిరులు పండడం ఖాయం.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక పాలసీ (టీఎస్-ఐపాస్ )ను పారదర్శకంగా రూపొందించారు. తెలంగాణ అనతికాలంలోనే పెట్టుబడులకు,పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. పేదలు ఆత్మగౌరవంతో బతకాలని సంకల్పించిన కేసీఆర్.. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. రానున్న కాలంలో తెలంగాణ అంతటా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించాలని సంకల్పించారు. ఇక పేదలకు పరిమితులు లేని రేషన్ బియ్యం ద్వారా కడుపు నిండా తిండి, వృద్ధులకు, వితంతువులకు , వికలాంగులకు,బలహీనవర్గాల వారికి పింఛన్లతో వారి బతుకులకు ఆసరాగా నిలబడుతున్నారు. కల్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాలతో పేదింటి అమ్మాయిల జీవితాల్లో కల్యాణ గంటలు మోగుతున్నాయి. సంక్షేమ హాస్టళ్ల పిల్లలకు సన్నబియ్యంతో పౌష్టికాహారం అందిస్తున్నారు.
బంగారు తెలంగాణ కల సాకారం దిశగా అడుగులు వేస్తు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ బాపు కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.