‘నేను మోనార్క్‌ని నన్నెవడూ మోసం చేయలేదు’ ఈ డైలాగ్ గుర్తోస్తే కనిపించేది ప్రకాష్ రాజే. ఇలాంటి ఎన్నో డైలాగులతో తనకుంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నాడు ప్రకాష్ రాజ్. దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించి, ఐదు భారతీయ భాషల మీద పట్టున్న విలక్షణ నటుడిగా పేరుగాంచాడు. రంగస్థల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన ఆరు భాషల్లో వందల చిత్రాల్లో నటించారు. నటుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేశారు. నటుడిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నారో అదే స్థాయిలో వివాదాలతోనూ సహవాసం చేశారు. అవన్నీ పక్కన పెడితే మానవతా వాదిగా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడక తప్పదు. ఆదివారం ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
ఏ పాత్ర అయినా చేయగల సుప్రసిద్ధ చెందిన నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నో సినిమాలో ప్రతినాయకుడిగా, తండ్రిగా, తాతగా ఇలా పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటించారు ప్రకాష్‌రాజ్. మంచి గుర్తింపును తెచ్చిన చిత్రం కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యుయెట్’. కెరీర్‌లో తొలినాళ్లలో ప్రకాష్‌రాజ్‌కు దక్కిన పాత్రలే ఆయనను జాతీయస్థాయి నటుడిని చేశాయని చెప్పాలి. ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇద్దరు’ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డునూ అందుకున్నారు. రంగస్థల నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్ కేవలం బ్రతకడం కోసమే తొలుత సినిమాల్లోకి వచ్చానని చెబుతారు. చిన్నతనం నుంచి ప్రేక్షకుల కొట్టే చప్పట్లే తనని నటుడిగా మార్చాయని అంటారు. తొలినాళ్ల చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు.
‘ఇద్దరు’, ‘సుస్వాగతం’, ‘చూడాలని ఉంది’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘బద్రి’, ‘అంతఃపురం’, ‘ఇడియట్’, ‘ఒక్కడు’, ‘దిల్’, ‘ఖడ్గం’, ‘ఠాగూర్’, ‘ఆజాద్’, ‘పోకిరి’, ‘అతడు’, ‘బొమ్మరిల్లు’, ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’ ఇలా అనేక సినిమాల్లో ప్రకాష్‌రాజ్ పోషించిన పాత్రలకూ విశేష ప్రేక్షకాదరణ చూరగొన్నాయి.
వెండితెరపై అద్భుతంగా నటించే ప్రకాష్‌రాజ్‌కు అవార్డులకు కొదవ లేదు. అయిదుసార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ‘ఇద్దరు’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా తొలిసారి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ఆయన ‘కాంచీవరం’ చిత్రానికి ఉత్తమనటుడిగా అవార్డు దక్కించుకున్నారు. అయిదుసార్లు ఫిలింఫేర్ అవార్డు, ఆరుసార్లు నంది అవార్డు, ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ అవార్డు ఒకసారి, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డును నాలుగుసార్లు, విజయ అవార్డును మూడుసార్లు సొంత చేసుకున్నారు. ఆయనకు మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిస్తూ, ప్రకాష్ రాజ్ గారి పుట్టిన రోజున గ్రేట్‌తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది.