హ్యాపీ బర్త్ డే…. మంచు లక్ష్మీ

412
manchu laxmi
- Advertisement -

‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో నటిగా ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తరువాత ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అంతేకాదు పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ‘మేము సైతం’ అనే టీవీ షోను కూడా నిర్వహిస్తోంది. మంచు లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ‘జీవితం ఇంతే అనుకుంటే నరకం.. జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం’ ఇది మంచు లక్ష్మీ ప్రసన్న నిత్యం ఆచరించే జీవనసూత్రం.కలెక్షన్‌ కింగ్‌మోహన్‌బాబు కుమార్తెగా ప్రేమతో మీ లక్ష్మీ్ అంటూ ఎందరో ప్రముఖులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వాళ్ల గురించి మనకెప్పుడూ తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో ఆమె చూపిన ప్రతిభ అనన్యసామాన్యం. నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనదైన పద్ధతిలో ప్రయోగాలు చేస్తూ సక్సెస్‌ ఫుల్‌గా ముందుకు వెళ్తోంది.

లక్ష్మి అంటే మోహన్‌బాబుకు అమితమైన ప్రేమ. లక్ష్మి పదో తరగతి వరకు చెన్నైలో, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో చదివారు. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ని అభ్యసించారు. అనంతరం అమెరికా వెళ్లి థియేటర్‌ ఆర్ట్స్‌లో చదువు కొనసాగించారు. 2006 ‘పర్‌ఫెక్ట్‌ లైవ్స్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ని నిర్మించి, నటించారు. తొలిసినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ లో ‘ఐరేంద్రి’గా విమర్శకులను సైతం మెప్పించడంతో పాటు తొలిసారి ప్రతినాయకురాలిగా నంది అవార్డును సైతం అందుకోవడం విశేషం.

తండ్రి స్ఫూర్తితోనే ఇప్పటికీ ఆరోగ్య సూత్రాలను పాటిస్తారట. మంచి కథ దొరికితే తన తండ్రితో ఓ సినిమా చేయాలని ఉందంటారు లక్ష్మి. ‘నాన్నతో ఏ రకమైన కథ చేసినా నాకు సవాల్‌ అనిపించేలా ఉండాలి. నేను విలన్‌ అయినా.. నాన్నగారు విలన్‌ అయినా ఫర్వాలేదు. పోటాపోటీ పాత్రలు వచ్చినప్పుడే చూడడానికి బాగుంటుంది’ అంటారు. నటిగా తనదైన ముద్రవేసిన లక్ష్మీ ప్రసన్న.. ప్రస్తుతం అమ్మగా కుమార్తె విద్యా నిర్వాణ ఆనంద్‌ తన సర్వస్వం అని పేర్కొంటారు. చక్కటి పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మీ ప్రసన్న మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటూ greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -