అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి చిత్రాలతో మాస్‌లోకి చొచ్చుకుపోయిన దర్శకుడు సురేందర్‌రెడ్డి.యాక్షన్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించడంలో బాగా నేర్పు కలిగిన ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ని ‘రేసుగుర్రం’గా తీర్చిదిద్దాడు. ప్రస్తుతుం ‘విద్రోహులకు ద్రోహం చేయడం… చెడును అంతం చేయడానికి స్వార్థంగా ఆలోచించడం… ‘ధృవ’ లక్షణం అంటూ డిసెంబర్ 9న ముందుకువస్తున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా greattealngaana.com ప్రత్యేక కథనం.
కరీంనగర్ జిల్లా మాచినపల్లి గ్రామంలో సురేందర్ రెడ్డి జన్మించారు. ఆరుగురు సంతానంలో నాలుగో వ్యక్తి. పదో తరగతి వరకు గురుకుల విద్యాలయంలోనే చదువు సాగింది. సినిమాలపై మక్కువతో డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేశారు.డిగ్రీ పూర్తయ్యేసరికి అంతా గొప్పగా భావించే దర్శకుడు కావాలన్న కోరిక బలపడింది. చదువుకాగానే హైదరాబాద్ బస్సెక్కారు.
హైదరాబాద్ రాగానే ఓ దర్శకత్వ శిక్షణ సంస్థలో చేరారు. కోర్సు పూర్తవగానే అవకాశాల వేట. నాలుగేళ్లు తిరిగి తిరిగి విసిగిపోయారు. చివరికి తన బావ సహాయంతో దర్శకుడు టి.ప్రభాకర్ దగ్గర చేరారు. రెండు సినిమాలకు అసిస్టెంట్‌గా చేశాక అక్కణ్నుంచి క్రాంతి కుమార్ దగ్గరికెళ్లారు. అసిస్టెంట్ అసోసియేట్‌గా మారారు. ఐదేళ్ల అనుభవంలో ఎవర్ని ఎలా మెప్పించాలో అర్థమైంది. కథ సిద్ధం చేసుకుని హీరో కళ్యాణ్‌రామ్‌కి వినిపించారు. వెంటనే ఓకే అయ్యింది.
2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా ‘అతనొక్కడే’ పెద్ద హిట్. అవకాశాలు వరుస కట్టాయి. ఎన్టీఆర్‌తో ‘అశోక్’, ‘వూసరవెల్లి’, మహేశ్‌బాబుతో ‘అతిథి’, రవితేజతో ‘కిక్’, ‘కిక్ 2’, అల్లు అర్జున్‌తో ‘రేసుగుర్రం’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. తొలి చిత్రానికే ఉత్తమ దర్శకుడిగా(తొలి పరిచయం) నంది అవార్డు అందుకున్నారు. ‘రేసుగుర్రం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డు పొందారు. కిక్ సినిమాతో సురేందర్ రెడ్డి చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
ఇకపై రీమేక్ సినిమాలు ఇకపై ఎప్పుడూ చేయనని.. సొంత కథలతోనే సినిమాలు చేస్తానని ప్రకటించాడు. బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా..అక్కడికి వెళ్లాలనే ఆలోచన లేదని చెబుతున్న సురేందర్ రెడ్డి…. మరిన్ని మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటూ మరోసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు…
ఎలాంటి ఒత్తిడీ లేదు
నాకు ప్రతి సినిమా కీలకమే. అలాగే ‘ధృవ’ చిత్రాన్ని కూడా కీలకంగానే భావిస్తున్నాను. నాకు, చరణ్‌కు పెద్ద హిట్టయి మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను. ఇది రీమేక్ సినిమా అనే ప్రెషర్ తప్ప దర్శకుడిగా మరే విధమైన ఒత్తిడి లేదు.
ఎలా ప్రారంభమైందంటే…
ఈ సినిమా కంటే ముందు నుంచే నేను చరణ్ సినిమాల గురించే పలుసార్లు చర్చించుకున్నాం. తనేదైనా కొత్తగా చేయాలనుకుంటున్నాడు. మా మధ్య స్టోరీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో చరణ్ తమిళ సినిమా చూశాడు. తనకు ఆ సినిమా బాగా నచ్చింది. తను ఓ రోజు నన్ను పిలిచి సినిమా చూడమన్నాడు. నేను చూసిన తర్వాత సినిమా ఎలా ఉందని అడిగితే సినిమా కంటెంట్ చాలా బావుందండి అని నేను చరణ్‌కు చెప్పాను. ‘నేను చేయవచ్చా!’ అని అడిగారు. కొత్తగా చేయాలని మీరేదైతే అనుకుంటున్నారో అలా ఉంది. మీరు చేయ్యవచ్చునని నేనూ చెప్పాను. ముందు నువ్వు డైరెక్ట్ చేరు అని చెప్పకుండా సినిమా ఎలా చేస్తే బావుంటుందోనని అడిగారు చరణ్. నేను బావుంటుందనగానే నువ్వు డైరెక్ట్ చెయ్యొచ్చు కదా అన్నారు. నేను రెండు రోజులు టైం కావాలని అడిగాను. రెండు రోజుల తర్వాత..చరణ్‌ను కలిసి కంటెంట్ బావుంది. కాబట్టి నేను చేస్తానని చెప్పాను.
అదే ఆలోచించాను
నేను ఈ సినిమా డైరెక్ట్ చేయడానికి రెండు రోజులు టైం అడిగిన తర్వాత ఆ రెండు రోజులు సినిమాను చాలా సార్లు చూశాను. ఈ సినిమాలో నేను ఏం చేయగలుగుతాను. నాకు రీమేక్ చేయడం రాదు. మరి నేను చేయడం కరెక్టా, కాదా అని ఆలోచించాను. అలా తమిళ సినిమా కథను జీర్ణం చేసుకోవడానికి రెండు రోజుల సమయం పట్టింది.
అరవిందస్వామి పాత్ర తగ్గించలేదు
తమిళంతో పోల్చితే తెలుగులో చరణ్ ఎప్పుడైతే సినిమాలోకి ఎంటర్ అయ్యారో చిన్న గీత వెనుక పెద్ద గీత పెడితే ఎలా ఉంటుందో అని సినిమా స్పాన్ పెరిగింది. అందుకు తగ్గట్టు హీరో క్యారెక్టర్‌లో చిన్న మార్పులు చేశాం. అలాగే అరవిందస్వామి క్యారెక్టర్‌ను ఉన్నపరిధి కంటే పెంచి చూపించామే తప్ప ఎక్కడా తగ్గించలేదు. టేకింగ్ పరంగా లొకేషన్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. అరవిందస్వామితో కలిసి సినిమాలో నటించమన్నప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అయితే ఏం మార్పులు చేయబోతున్నారో చెప్పమని అన్నారు. నేను ఓ వారం తర్వాత ఆయన్ను కలిసి ఎలాంటి మార్పులు చేయబోతున్నానో చెప్పాను. ఆయనకు అవి నచ్చాయి.
చిరంజీవితో సినిమా
చిరంజీవితో కచ్చితంగా సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది ఉండొచ్చునని అనుకుంటున్నాను. కథ రెడీగా ఉంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. నిర్ణయం వాళ్లే తీసుకోవాలి. చిరంజీవితో యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయాలని ఉంది. ‘కిక్’ లాంటి డిఫరెంట్ ఎంటర్‌టైనర్ చేస్తాను.
సిక్స్‌ప్యాక్ పాత్ర కోసమే
చరణ్ చాలా హార్డ్ వర్కర్. తను సినిమా రీమేక్ చేయాలనుకోగానే బాడీ ఫిట్‌గా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.క్యారెక్టర్ కోసం ఏమైనా చేయడానికి ఆయన రెడీ. అందుకోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆరు నెలలు పాటు జిమ్ బాడీని మెయిన్‌టెయిన్ చేయడం అంత సులభం కాదు. చాలా ప్యాషన్‌తో సినిమా పట్ల కేర్ తీసుకున్నాడు. డైరెక్టర్ ఏం చెబితే అది చేశాడు.
విన్నదానికి విరుద్ధంగా చరణ్
నేను చరణ్‌ను కలవక ముందు ఆయన గురించి చాలా విన్నాను. కానీ ఆయన్ను కలిసిన తర్వాత ఆయనెలా ఉంటారో తెలుసుకున్నాను. బయట విన్నదానికి ఆయన పూర్తి విరుద్ధంగా ఉంటారు. ఇన్ని రోజుల ట్రావెల్‌లో ఇలాంటి మంచి హృదయమున్న హీరోను నేను చూడలేదు. ఒకసారి ఓ మాట అన్నాడంటే తను మరచిపోడు. అంత కమిట్‌మెంట్, నిజాయితీ నేనెక్కడా చూడలేదు. దర్శకుడు ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అడిగిన టెక్నిషియన్స్‌ను ఇచ్చారు. ఆయనంత సపోర్ట్ చేశారు కాబట్టి సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది.