విజయవంతంగా నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ36

110
ISRO successfully launches PSLV-C36

భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో మరో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి బుధవారం ఉదయం 10.25 గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ36(పీఎస్‌ఎల్వీ-సీ36) వాహకనౌకను విజయవంతంగా నింగిలోకి పంపించింది. సోమవారం రాత్రి 10.25 గంటలకు నుంచి నిరంతరాయంగా కొనసాగిన కౌంట్‌డౌన్‌ పూర్తికాగానే రిసోర్స్‌శాట్‌-2ఎ అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ26 రాకెట్‌ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.

రాకెట్‌ నుంచి విడిపోయిన ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలో చేరడంతో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్‌ కిరణ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలను అభినందించారు. రిసోర్స్‌ శాట్‌-2ఎ ఉపగ్రహం బరువు 1,235 కిలోలు. ఇది ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఇది రైతులకు ఎంతో ఉపయోకరమైన సమాచారాన్ని అందజేయనుంది. వాతావరణ అధ్యయనానికి కూడా ఉపయోగపడుతుంది.

ISRO successfully launches PSLV-C36

పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సిరీస్‌లో ఇది 38వ ప్రయోగం. 1994-2016 నుంచి ఇప్పటిదాకా 121 ఉపగ్రహాలను రోదసీలోకి పంపారు. ఇందులో 42 స్వదేశీ, 79 విదేశీ ఉపగ్రహాలు కావడం విశేషం. 2003 అక్టోబర్ 10న పీఎస్‌ఎల్‌వీ సీ5 ద్వారా రిసోర్స్‌శాట్-1, 2011 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ-16 ద్వారా రిసోర్స్‌శాట్-2ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆ రెండు ఉపగ్రహాలకు ఫాలోఅప్‌గా బుధవారం రిసోర్స్‌శాట్-2ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.