మంగళవారం ఉదయం 6 గంటలకు నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ లకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేయల్సివుంది. ఈ తరుణంలో ఉరిశిక్షపై మరోసారి స్టే విధించింది ఢిల్లీ కోర్టు.
గతంలో ఇచ్చిన డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా సోమవారం ఉదయం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గుప్తా కోరాడు. దీంతో విచారణ అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. స్టే ఇవ్వడం ఇది మూడోసారి.
ఇదివరకే జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా పిటిషన్‌తో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్ కోర్టు.