జాతిపిత, మహాత్మా గాంధీ గారి 150 జయంతి సందర్భంగా గాంధీ జీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ దేశంలోని ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ.ఈ సందర్భంగా అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో శాసన మండలి చైర్మన్ మాట్లాడిన అంశాలు.. మహాత్మా గాంధీ ఆయాశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది అని గాంధీజీ చెప్పిన మాటలను నిజం చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆరు సంవత్సరాల కాలంలో మూడు పర్యాయాలు స్వచ్ భారత్ అవార్డ్ అందుకుని దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
గ్రామాల అభివృద్ధిపైన ముఖ్యమంత్రి పెట్టినంత శ్రద్ధ దేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలేదు. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి ప్రోగ్రాంల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు గుత్తా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన దేశానికి ఆదర్శంగా నిలిచాయి. రైతు బంధు,రైతు భీమా,మిషన్ భగీరథ, పథకాలను దేశ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకొన్నారు. గాంధీ జీ చెప్పిన సిద్ధాంతాలు పాటిస్తూ, అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలి అన్నారు. సుఖేందర్ రెడ్డి గారితో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి,రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్,దేశంలోని ప్రముఖులు పాల్గొన్నారు.