వ్యవసాయం అంటే వ్యాపారం కాదు జీవిన విధానమని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల సదస్సులో పాల్గొన్న సీఎం..రైతు సమస్యలపై అవగాహన కల్పించారు.
గత ప్రభుత్వాల తీరుతో రైతు పరిస్థితి ఘోరంగా మారిందని.. ఒకప్పుడు కరువు వస్తే ఆ ఏడాదిని గుర్తు పెట్టుకునే వాళ్లమని తెలిపారు.దశాబ్దాల తరబడి వేదనకు గురైన రైతుల గోస తీర్చేందుకు ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వ్యవసాయానికి రైతే రాజని…రైతుల జీవితాల్లో వెలుగుల నింపేందుకే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామన్నారు. రైతు సమన్వమ సమితి అధ్యక్షుడిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించారు సీఎం.అనుభవం కలిగిన ఆయన సేవలు రైతు సంఘానికి ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రతి రైతు వేదికకు రూ.12లక్షలు మంజూరు చేస్తం. ప్రతి రైతు వేదిక 5 వేల ఎకరాల పంట లెక్క తీయాలి. ఇప్పుడున్న 141 సబ్ రిజిస్ట్రార్‌లు అలాగా ఉంటారు. ఎమ్మార్వోలు కూడా సబ్ రిజిస్ట్రార్‌లుగా ఉంటారు. ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్ట్రార్‌గా ఉంటారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ గురించి లంచాలు ఇచ్చుడు బంద్. పాస్ బుక్ ఇవ్వడంలో సబ్ రిజిస్ట్రార్ ఆలస్యం చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫైన్ విధిస్తం. అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందుబాటులో ఉంటుంది. పాస్ పోర్టు వచ్చినట్టే పాస్ బుక్కులు కూడా పోస్టులో ఇంటికి వస్తాయని పేర్కొన్నారు.
రైతు సమన్వయ సమితి సభ్యులను దఫదఫాలుగా ఇజ్రాయెల్ పంపిస్తామని చెప్పారు. రైతులకు ప్రి పెయిడ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రిపెయిడ్ కార్డుల్లో ఎప్పటికప్పుడు నగదు క్రెడిట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నం. కోటి ఎకరాలు ప్రాజెక్టుల ద్వారానే పారే విధంగా అహోరాత్రులు శ్రమిస్తున్నామని చెప్పారు సీఎం.