తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్ధానానికి నేడు నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 2015లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి యాదవరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీంతో టీఆర్‌ఎస్ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మన్ అనర్హత వేటువేశారు. దీంతో యాదవరెడ్డి హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అనర్హత వేటు సరైనదేనని తీర్పువచ్చింది. ఆగస్టు 1వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. 7వ తేదీ నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 16న నామినేషన్ల పరిశీలన, 19న ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నిక లాంఛనమే కానుంది.