దేశ రాజకీయ గతిని మార్చుతాయన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. సోమవారం ఆ రాష్ట్రంతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. 10 గంటలకల్లా ఫలితాల సరళిపై స్పష్టత వస్తుంది. తొలి ఫలితం 11:30కి వస్తుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ బీజేపీ విజయం ఖాయమని వెల్లడించాయి. గుజరాత్‌లో ఆ పార్టీ విజయం నల్లేరుపై బండినడకేనని మొదట్లో అంతా భావించారు.
అయితే పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. ఓబీసీ, దళిత నేతలు అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మెవానీల మద్దతు కూడగట్టిన కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ.. బీజేపీకి మొదటిసారి సవాల్ విసిరారు. జాతీయ స్థాయి ఎన్నికలను తలపించేలా వాడివేడి ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ప్రధానిని నీచమైన వ్యక్తి అని చేసిన వ్యాఖ్యలు మొత్తం ప్రచార సరళినే మార్చేశాయి. ఇక హిమాచల్‌లో బీజేపీ విజయం ఏకపక్షమేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 68 స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేశాయి. ప్రతి ఐదేళ్లకు ఇక్కడ ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అదే జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యం..
గుజరాత్ (182)
ఆధిక్యం / గెలుపు
బీజేపీ-105
కాంగ్రెస్-75
ఇతరులు 2
హిమాచల్ (68)
ఆధిక్యం / గెలుపు
బీజేపీ-40
కాంగ్రెస్-23
ఇతరులు-1