10 రాష్ట్రాలకు విస్తరించిన గ్రీన్ ఛాలెంజ్..

39
- Advertisement -

సీఎం కేసీఆర్ స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహాయజ్ఞంలా సాగుతోంది. ఐదేళ్లలో కోట్లాది మొక్కలు, ఎన్నో రికార్డులు, మరెన్నో ప్రశంసలు…అంతకుమించి లక్షలాదిమందిలో సామాజిక స్పూర్తిని నింపింది. పచ్చదనం పెంపొందించడం, ప్రతి ఒక్కరి బాధ్యత అనే స్థాయికి తీసుకెళ్లింది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును, పచ్చని పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఐదు సంవత్సారాల్లోనే దారులు వేసింది.

సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం స్పూర్తితో ఐదేళ్ల క్రితం ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహాయజ్ఞంలా సాగుతోంది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించాలన్న బృహత్ సంకల్పంతో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు శ్రీకారం చుట్టారు. పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైంది.
గడిచిన ఐదేళ్లలో ఏకంగా 10 రాష్ట్రాలకు విస్తరించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో అన్ని రాష్ట్రాల్లో కోట్లాది మొక్కలను నాటి, వాటిని పరిరక్షిస్తున్నారు….

గ్రీనరీ పెంపుకోసం ఇప్పటివరకు చాలా స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ ప్రేమికులు అనేక కార్యక్రమాలను చేపట్టారు. కానీ వాటన్నింటికి భిన్నంగా ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సాగుతోంది. కాంక్రీట్ జంగిల్స్ లా మారిన పట్టణాల్లో పచ్చదనం పెంపుపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రధానంగా ఫోకస్ చేసింది. బీజీ లైఫ్స్ గడుపుతున్న పట్టణ ప్రజలకు పర్యావరణ సృహను కల్పించింది. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి, మరో ముగ్గురిని నామినేట్ చేయడం అనే కాన్సెప్టును నగరవాసులు ఓన్ చేసుకున్నారు. పైగా సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్ గా ఉండే యువత.. తమ పుట్టిన రోజులు, ఇతర స్పెషల్ అకేషన్స్ లో మొక్కలు నాటి తమ ఫ్రెండ్స్ ను నామినేట్ చేయడం మొదలు పెట్టారు. దీనికి తోడు సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడంతో ….ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన హరిత యజ్ఞానికి మరింత క్రేజ్ వచ్చింది…

పార్లమెంట్ ఆవరణ నుంచి పల్లెల్లోని ప్రతి ఇంట్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో మొక్కలు నాటారు. ఉపరాష్ట్రపతి మొదలు కొని, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, పలు దేశాల రాయబారులు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొన్నారు. ఇలా హరిత స్పూర్తి విదేశాలకు సైతం పాకింది. సందర్భమేదైనా సరే…ఒక మొక్కను నాటాలన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయడంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సఫలమైంది. అంతేకాదు బహుమతులుగా బొకేలు, శాలువాలకు బదులుగా మొక్కలను ఇచ్చుకునే సంప్రదాయం కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ కారణంగా మరింత పెరిగింది. ఏదో సరదా కోసం మొక్కలు నాటడం, ఆ తర్వాత వాటిని వదిలేయడం కాకుండా, మొక్కల పరిరక్షణపై కూడా గ్రీన్ ఇండియా అవగాహన కల్పించింది. దీంతో ఈ కార్యక్రమంలో భాగంగా కోట్లాది మొక్కలను నాటి, సంరక్షించారు…

2018 జులైలో ‘హరా హైతో బరా హై’ నినాదంతో ప్రారంభిం చిన ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ప్రతిఒక్కరినీ పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు, అర్బన్ ఫారెస్టులను దత్తత తీసుకోవడం అనే కాన్సెప్టును ఎంపీ సంతోష్ కుమార్ పరిచయం చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కీసర ఫారెస్టును దత్తత తీసుకున్నారు సంతోష్ కుమార్. ఆయన స్పూర్తితో 1650 ఎకరాల ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్టును బాహుబలి స్టార్ ప్రభాస్ దత్తత తీసుకున్నారు. అంతేకాదు హెటిరో సంస్థ కూడా ముంబాపూర్-నాగవల్లి రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకుని గ్రీనరీని పెంపొందిస్తూ సంరక్షిస్తోంది. వీరితో పాటూ పలువురు సెలబ్రెటీలు పచ్చదనం పరిరక్షణ సంకల్పాన్ని తీసుకున్నారు. వారికి ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తినిచ్చింది. కేవలం వ్యక్తులే కాదు కొన్ని సంస్థలు కూడా అర్బన్ ఫారెస్టులను దత్తత తీసుకోవడం, మొక్కలు నాటడంలో భాగస్వామ్యులయ్యాయి…

Also Read:‘బ్రో’ థియేట‌ర్ల‌లో ‘భోళా శంక‌ర్’!

2021 జూలై 4న హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న 58వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ 9 దుర్గానగర్ అటవీ శాఖ క్షేత్రంలో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని వరల్డ్ రికార్డులో భాగంగా గంటలో 3లక్షల 50వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 11.05 గంటలకు ప్రారంభించిన కార్యక్రమం 12 గంటలకు పూర్తయింది. గంటలో సుమారు 20వేల మంది హాజరై మొత్తం 3లక్షల 50వేల మొక్కలు నాటినట్లు వండర్బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతానికి పడిపోయిన గ్రీనరీని 33 శాతానికి పెంచేందుకు హరితహారం అనే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారన్నారు.

2021 జూలై 24న మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. విజయవంతమైన ఈ కార్యక్రమం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ తాను స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, సింగరేణి ఏరియా, సుల్తానాబాద్, చొప్పదండి నియోజక వర్గంలో వెడురుగట్ట, కుదురుపాకల్లో మొక్కలు నాటారు. ఉదయం ఆరు గంటల నుండే ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం, సాయంత్రం దాకా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గ్రామాల్లోనే 2 కోట్ల 5 లక్షలు మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.

2021 జూలై 27న ప్రముఖ నటుడు, బిగ్ బీ, పద్మవిభూషన్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్తో కలిసి ఆయన మొక్కలు నాటారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బీతో కలిసి సెల్ఫీలు దిగారు. రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి పాల్గొన్నారు.

2022 ఫిబ్రవరి 9న ఢిల్లీలో పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటారు. దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చ్టుటారు. కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్లో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్తో పాటు ఎంపీలు జైరాం రమేశ్, సంజయ్ సింగ్, విజయ సాయిరెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి, బినోయ్ విశ్వం, మాగుంట శ్రీనివాసులు, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2022 ఫిబ్రవరి 17న టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో అక్కినేని నాగార్జున.. గతంలో ఇచ్చి న మాట ప్రకారం మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అంతేకాదు దత్తత తీసుకున్న అటవీ భూమిలో మొక్కలు పెంచే బాధ్యత తీసుకున్నారు. దత్తత తీసుకున్న అటవీ భూమిలో మొక్కలు నాటే కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగ చైతన్య, మేనల్లుడు సుశాంత్తో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. జూన్ 16 2022లో గ్రీన్ ఇండియా కార్యక్రమంలో సద్గరు జగ్గీ వాసుదేవ్ పాల్గొని మొక్కలు నాటారు.

Also Read:‘సలార్’ టీజర్ ఉదయాన్నే ఎందుకు?

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేసారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 2023 ఫిబ్రవరి 17న కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఎంపీ సంతోష్ కుమార్ దత్తత తీసుకున్నారు. కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్టెమెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. మొదటి విడతగా కోటి రూపాయల వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని ఎంపీ ప్రకటించారు. దశల వారీగా మిగతా నిధులు కూడా అందించి లక్షిత పనులు పూర్తి చేస్తామని ఎంపీ తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా 2023 మార్చి8న రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్స్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్ లో ‘“గ్రీన్ ఇండియా ఛాలెంజ్’” స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్కు చోటు లభించింది. ఈ ఛాలెంజ్లో భాగంగా ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే” బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్కు రికార్డ్స్లో చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ప్రశంస పత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీకి అందించినట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా దుర్గా నగర్లో 2021 జులై 4వ తేదీన సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16వేల 900 వందల మంది భాగస్వామ్యంతో 3లక్షల 54వేల 900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు ఆ సంస్థ వివరించింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించి.. దేశం మొత్తం పచ్చగా మారేందుకు ఎంతగానో కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కు అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏప్రిల్ ఒకటిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డు లబించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూస్ 18 గ్రూపు… గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గుర్తించింది. నెట్స్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎంపీ సంతోష్ కుమార్ ను హైదరాబాద్ లో కలిసి అవార్డును అందజేశారు.పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్పృహ, అన్ని వర్గాల ప్రాతినిథ్యానికి కృషి చేస్తున్న సంతోష్ పై ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు న్యూస్ 18 సంస్థ తెలిపింది. బాలీవుడ్ తారలు అమీర్ ఖాన్, సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, కంగనారౌత్, ఆస్కార్ అవార్డు గ్రహీతలు, ట్రిపుల్ ఆర్ మూవీ టీఎం సభ్యులు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని, మొక్కలు నాటారు.

ప్రజాభాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమమైనా విజయవంతమవ్వడం కష్టం. అయితే పర్యావరణ సంరక్షణ అనే ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం చాలా కష్టమైన పని. దాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ఒక ప్రణాళిక ప్రకారం సాధించారు. ఐదేళ్ల చిన్నారి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనేలా స్పూర్తిని రగిలించారు. పచ్చదనం పెంపు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిచండం ప్రతి ఒక్కరి బాధ్యత అనే నినాదాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. కోటి వృక్షార్చన, ముక్కోటి వృక్షార్చన వంటి భారీ కార్యక్రమాలతో లక్షలాది మందిని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములను చేయగలిగారు. చెట్టు గొప్పతనాన్ని తెలియజేసే సాహిత్య సంకలనంగా వృక్షవేదం అనే పుస్తకాన్ని ప్రచురించారు. భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో చెట్టు గొప్పతనాన్ని వివరించే శ్లోకాలను సేకరించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. దివ్యజ్ఞానంతో అర్థం చేసుకుంటే యజ్ఞం చెట్టుతో సమానమని చెప్పే ఈ పుస్తకం పర్యవరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్నది. అందుకే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోట్లాది మందిలో ప్రేరణ కలిగించింది. ఈ కార్యక్రమం కేవలం గంట వ్యవధిలోనే పది లక్షల మొక్కలు నాటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నది. ఇక దేశం నలుమూలల నుంచి దక్కిన ప్రశంసలకైతే లెక్కే లేదు.

మొక్కలు నాటడంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం కోసం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టారు ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరా రోజు జమ్మి ఆకులను ప్రతి ఒక్కరు పూజిస్తారు. వాటిని ఒకరికొకరు అందించుకుంటారు. అలాంటి జమ్మి వృక్షాలను కూడా ప్రతి ఊర్లో, ప్రతి గుడిలో నాటేందుకు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గుండెలకు దగ్గరైంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. జమ్మి చెట్లను పెంచడం, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు ఉండాలన్న సంకల్పం తీసుకోవడంతో ప్రజలు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ కు కనెక్ట్ అయ్యారు.

సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా తోడవ్వడంతో రాష్ట్రంలో గణనీయంగా పచ్చదనం పెరిగింది. కేవలం ఎనిమిది సంవత్సారాల్లోనే తెలంగాణలో గ్రీన్ కవరేజ్ 7.7 శాతం పెరగడంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా తన వంతు పాత్రను పోషించింది.

- Advertisement -