మత్తులోనే మందుబాబులు@ 16 కోట్లు

275
alchohol
- Advertisement -

ఆల్కహాల్ ఒకప్పుడు వ్యసనం, ఇప్పుడు కల్చర్‌లో ఓ హ్యాబిట్. తాగుబోతులను నీచంగా చూసే రోజులు పోయి… మందు ముట్టని వాడిని విచిత్రంగా చూసే రోజులు వచ్చాయి. విందు,వినోదం,పెళ్లి,చావు ఏదైనా కొత్త బిచ్చగాడికి పొద్దు ఎరగడు అన్నట్టుగా మామ ఎక్‌ పెగ్‌లా అంటూ విచ్చలవిడిగా తాగేస్తున్నారు. గెలిస్తే సంతోషంతో ఓడితే బాధలో ఏదైనా మత్తులోనే భారతం ఊగిపోతోంది.

ఎయిమ్స్‌ ఆధ్వర్యంలోని ఎన్‌డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం-సాధికారత శాఖ చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారత్‌లో మద్యం ప్రియుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని జాతీయ స్ధాయిలో 16 కోట్ల మంది మద్యం ప్రియులు ఉన్నారని సర్వే వెల్లడించింది. భారతదేశ జనాభాతో పోలీస్తే 14.6 శాతంగా ఉంది. మద్యం ఎక్కువగా తాగే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్‌ ప్రదేశ్, గోవా అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది.

10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు మద్యం సేవించటం వల్ల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారని వెల్లడైంది. దేశంలోని 186 జిల్లాలలో చేసిన ఈ సర్వేలో మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయని వెల్లడించింది.

మద్యానికి అలవాటైన వారిలో ఎక్కువగా యూత్‌ ఉండటం ఆందోళన కలిగించే విషయం. అతిగా మద్యం సేవించటం వలన మెదడు పనితీరు తగ్గి చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి మద్యం నియంత్రణ కోసం కృషిచేయాలని కోరుతున్నారు.

- Advertisement -