ఎంపీ సంతోష్ సంకల్పం గొప్పది: తమిళి సై

40
santhosh

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్ లో మొక్కలు నాటారు.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ తో పాటు రాజ్ భవన్ లో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతతో ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

భూగోళంపై మానవాళి మనుగడ సాగించాలంటే ప్రకృతి విధ్వంసం ఆగాలని, ప్రకృతి పరిరక్షణ పెద్ద ఎత్తున సాగాలని స్పష్టం చేశారు.భావితరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే మనం వారికి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని గవర్నర్ వివరించారు.ఈ దిశగా సుస్థిరమైన అభివృద్ధిని పాటిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించాలని డాక్టర్ తమిళిసై అన్నారు.ఈ సందర్భంగా రాజ్యసభ మెంబర్ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపడుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని గవర్నర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంతోపాటు, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం పది కోట్ల మొక్కలు నాటాలని సంతోష్ కుమార్ సంకల్పం చాలా గొప్పదని గవర్నర్ ప్రశంసించారు.ఆయన చేపడుతున్న కార్యక్రమంతో రాష్ట్రంలో, దేశంలో మరింత పచ్చదనం పెంపొందుతుంది అని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల సంతోష్ కుమార్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నుండి కూడా ప్రశంసలు పొందడం పట్ల గవర్నర్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ను శాలువా, మెమెంటో తో గవర్నర్ దంపతులు సత్కరించారు.పచ్చదనాన్ని పెంపొందించడానికి సంతోష్ కుమార్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఉద్యమ రూపం సంతరించుకుందని, ఇది అత్యంత అభినందనీయమైన అంశమని డాక్టర్ తమిళసై అన్నారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గవర్నర్ కు వృక్ష వేదం అన్న సంకలనాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి. సౌందరరాజన్, గవర్నర్ సెక్రటరీ కె. సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని మొక్కలు నాటారు.