నమో నరసింహ స్వామి..కళ్యాణం..కమనీయం

331
Yadadri_temple
- Advertisement -

యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. యాదాద్రి బాలాలయంలో శుక్రవారం శ్రీవారి కల్యాణమహోత్సవం కోలాహలంగా అర్చకులు నిర్వహించారు.ఆకాశమంత పందిరితో భూదేవి అంత పీటలతో జగదానందదాయకంగా కళ్యాణతంతు జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, నాదస్వరం, భక్తినినాదాల మధ్య పరిణయనోత్సవ వేడుక వైభవంగా జరిగింది.

కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, యాజ్ఞీకులు ఎస్. శ్రీనివాసాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు శ్రీవారి కల్యాణతంతును వైభవంగా నిర్వహించారు.

భక్తకోటి, దేవకోటి చరా జగత్తు అంతా శ్రీవారు జగదానందదాయకంగా చేసుకునే తిరుకళ్యాణ వేడుకలను యాదాద్రిలో తనివితీరా దర్శించి మైమరచిపోయారు. వేదపండితుల వేదఘోష, హాజరైన విశేష భక్తజనం వేయి కళ్లు చాలవా అన్నట్లు చూస్తుండగా కల్యాణతంతు జరిగింది.

భక్తులు భాగ్యోత్సవాలుగా భావించే లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన కల్యాణతంతును వీక్షించడానికి అశేష భక్తజనం యాదాద్రికొండకు తరలివచ్చారు. కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వీలుగా ఎక్కడికక్కడ క్లోజుడ్ సర్క్యూట్ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కల్యాణతంతు ఘట్టాలన్నింటినీ వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు.

- Advertisement -