బాలీవుడ్,టాలీవుడ్ ఏదైనా ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సినీ,రాజకీయ,స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. తాజాగా భారత గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా జీవిత
చరిత్ర ప్రేక్షకుల ముందుకురానుంది.
గోపి నయనార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రీప్ట్,చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
1875లో జన్మించిన బిర్సా ముండా గిరిజన ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నారు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. కనీసం పాతికేళ్లు కూడా నిండకుండానే కనుమూసిన బిర్సా ముండా బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు.