ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు..

186
kcr

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా కోత విధించిన వేతనాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభం కారణంగా మార్చి, ఏప్రిల్, మే, నెలలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు,పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో తెలంగాణ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో జూన్‌కు సంబంధించి ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పింఛన్‌ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం,జీతాలు,పింఛన్ల కోతపై ఉద్యోగులు,పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ బకాయిలు చెల్లింపుల విధానాన్ని ప్రకటించింది. పెన్షనర్లకు అక్టోబర్, నవంబర్‌లో రెండు విడతలుగా చెల్లింపులు జరపాలని నిర్ణయించింది. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా చెల్లింపులు జరిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.