టీఆర్‌ఎస్‌ నేతలపై గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు..

111
- Advertisement -

టీఆర్‌ఎస్‌లో రాసలీలలు కొత్తేం కాదని… వనమా రాఘవే కాదు.. టిఆర్ఎస్‌లో చాలామంది ఉన్నారని మాజీ ఆర్టీసీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనపడని రాసలీలలు ఎన్నో ఉన్నాయి అన్నారు. ఎంతోమంది మీ పార్టీ లీడర్లు అమాయకులను వంచనకు గురి చేస్తున్నారన్నారు. త్వరలో అన్ని ఆధారాలు బయటపెడతా అన్నారు. ప్రజాప్రతినిధుల అధికారిక గృహాల్లో ఏం నడుస్తుందో మీకు తెలుసా? అని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ సీఎం గారు మీ పోలీస్‌ మీకు ఏం చెప్పట్లేదా? గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. గన్ మెన్ ల నుంచి ప్రతి సమాచారం డీజీపీకి అందేది. లీడర్లు ఎటు తిరుగుతున్నారు అని పక్కా సమాచారం ఉండేది. లీడర్ పక్కదారి పడితే వెంటనే అలర్ట్ చేసే వ్యవస్థ ఉండేది. మీరు ఒకసారి నిఘా పెట్టి చూడండి.. ఎన్నో కేసులు బయటకు వస్తాయి. అధికార మదంతో మీ నాయకులు రాసలీలలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఒక కాల్ సెంటర్ పెట్టి చూడండి.. ఎన్ని రాసలీలలు మీ దృష్టికి వస్తాయి’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే చందర్‌ మీద మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇస్తే తనను దళిత ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ రాసలీలలు త్వరలో బయటపెడతానని తెలిపారు. రామగుండంలో ఇసుక, బూడిద, మాఫియాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు. ‘నేను దళిత వ్యతిరేకిని కాదు.. నన్ను కొప్పుల ఈశ్వర్, అతని అనుచరులు బదనామ్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రామగుండం కార్పోరెషన్‌ అవినీతి మయంగా మారిందని రామగుండం మేయర్ ను దించేవరకు పోరాటం చేస్తానని గోనె ప్రకాశ్ రావు స్పష్టం చేశారు.

అంతకుముందు కూడా గోనె ప్రకాశ్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిలల మీద కూడా చేశారు. గతేడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానుల పేరిట కొంత మంది తనను బెదిరిస్తున్నారని, ఇదే విధంగా బెదిరింపులు కొనసాగితే జగన్ బండారం బయటపెడుతానని ప్రకాశ్ రావు చెప్పారు. విదేశాల్లో కూర్చుని తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ముంటే వారు తన ముందుకు చర్చకు రావాలని ఆయన అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకు, వైఎస్ పాలనకు మధ్య నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని, విజయసాయి రెడ్డి ఫైనాన్స్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొనలేదని ఆయన చెప్పారు. నాలో… నాతో వైఎస్సార్ పుస్తకంలో తండ్రికి అండగా జగన్ పాదయాత్ర చేశారని విజయమ్మ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో తాను, తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభం నుంచి చివరకు ఉన్నామని గోనె ప్రకాశరావు చెప్పారు.

- Advertisement -