మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి- మంత్రి హరీష్‌

111
- Advertisement -

కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాస రావుతో కలిసి, అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశా కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడో వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధత, వ్యాక్సినేషన్, వైద్య సేవలు తదితర అంశాలపై మంత్రి ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి, రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయడంతో పాటు, 15-18 ఏళ్ల వారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకు వస్తారు, వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్లు అందించాలని మంత్రి సూచించారు. జనవరి 10వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావలి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యం ఇచ్చి, రెండు డోసులు పూర్తి చేసి, బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలి. ఆశాల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరు ఉండకూడదనే లక్ష్యంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.

సబ్ సెంటర్, పీహెచ్సీ స్థాయిలోనే చికిత్స..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఒకకోటి హోం ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లు సమకూర్చుకున్నాము, వీటిని అన్ని జిల్లాల పీహెచ్సీ, సబ్ సెంటర్ స్థాయికి సరఫరా చేయడం జరిగింది. ఎవరికి లక్షణాలు కనిపించినా ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి, సాధారణ లక్షణాలు ఉంటే మందుల కిట్లు ఇచ్చి ఇండ్లలో ఐసోలేషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీరి ఆరోగ్య పరిస్థితిని ఆశాలు రోజువారీ పరిశీలించి, అవసరమైతే వారిని సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించాలి. మూడో వేవ్లో వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రమాదం తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా చైతన్య పరచాలి. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రజలు అప్పుల పాలు కాకుండా చూడాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీ, మున్సిపల్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన పెంచాలి. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలి. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్గకాలిక రోగులకు సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చూసుకోవాలన్నారు.

లక్ష్యంతో పని చేద్దాం.. దేశానికి ఆదర్శంగా నిలుద్దాం.
కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో వైద్యారోగ్య శాఖ ఎంతో కృషి చేసి ప్రజల ప్రాణాలను కాపాడింది, ఇప్పుడు అదే స్ఫూర్తితో పని చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచిల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది, ఇందులో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ఆశాల కృషి దాగుంది. వచ్చే రెండేళ్లలో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో అందరం కలిసి పని చేద్దాం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు, ముందుండి వారికి సేవ చేసే అరుదైన అవకాశం ఆరోగ్య శాఖకు దక్కింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, దేశంలోనే తెలంగాణ ఆరోగ్య రంగాన్ని మొదటి స్థానానికి చేర్చాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వానికి ఆశాల ధన్యవాదాలు..
గత ప్రభుత్వాల హయాంలో పారితోషకం పెంపు కోసం ఆశా కార్యకర్తలు ధర్నాలు చేసేవారు, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తినాల్సిన పరిస్థితులు ఉండేవి. గుర్రాలతో తొక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఆశాల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మరోసారి ౩౦ శాతం పారితోషకం పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆశాలకు సూచించారు. ఆశాల అందరి తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా. పారితోషకం పెంపు సంతోషాన్ని ఆశా కార్యకర్తలు నాతో పంచుకున్నారు. సంకాంత్రి పండుగ సందర్బంగా ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌ రావుకు రుణపడి ఉంటామని ఆశా కార్యకర్తలు టెలి కాన్ఫరెన్స్లో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో మరింత బాగా పని చేస్తామని, ప్రజల మన్ననలు పొందేలా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.

- Advertisement -