గోల్కొండ బోనమెత్తింది..

206
golkonda bonam
- Advertisement -

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల జాతర వచ్చేసింది. ఆషాఢ మాసంలో ఊరూరా అంగరంగ వైభవంగా జరుపుకొనే ఈ సంబురాలు ఆదివారం హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీజగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో తొలిబోనంతో బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి సమర్పించారు. అనంతరం లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ వరకు ఘటాలతో పాటు తొట్టెలు, బోనాల ఊరేగింపు ఘనంగా మొదలైంది. ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపును ప్రారంభించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

golconda-bonalu

బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు.. నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుదరువుల మధ్య లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు దారిపొడవునా నృత్యాలు చేసి అలరించారు. అటు బోనాల ఉత్సవాలతో గోల్కొండ కోట పరవశించిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది. వేడుకల సంరద్భంగా కోటను ప్రత్యేకంగా అలంకరించారు. కోట ప్రధాన గేటు వద్ద లైటింగ్‌లతో అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేశారు. గోల్కొండ లోపల లైటింగు స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కోటపై కొలవుదీరిన జగదాంబికా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మ దర్శనం కోసం కోటకు భక్తులు పోటెత్తారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించి.. మొక్కులు చెల్లించి చల్లంగా చూడమని వేడుకున్నారు. బోనాల సంధర్బంగా ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.

- Advertisement -