టీటీడీ ఆలయాల్లో ప్రారంభమైన గోపూజ

21
ttd

తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుపతి లోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయాల్లో బుధవారం అధికారులు గో పూజను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఆలయంలో భక్తులకు గోపూజ అందుబాటులోకి వచ్చే ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విదితమే.

ఈ మేరకు డిప్యూటీ ఈవో జనరల్ శ్రీ రమణ ప్రసాద్ గో సంరక్షణ శాల అధికారులు బుధవారం ఆయా ఆలయాలకు గోవులు, దూడలను అందజేసి గోపూజ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయం వాహన మండపంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో డిప్యూటి ఈవో శ్రీమతి కస్తూరిబాయి, అర్చకులు బాబు స్వామి పాల్గొన్నారు. శ్రీనివాసమంగాపురంలో నిర్వహించిన గోపూజలో డిప్యూటి ఈవో శ్రీమతి శాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిర్వహించిన గోపూజలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, కపిలతీర్థం ఆలయంలో నిర్వహించిన గోపూజ లో డిప్యూటి ఈవో సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.