కేటీఆర్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా ముక్కోటి వృక్షార్చన..

244
santosh
- Advertisement -

దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపాలనే పట్టుదలతో కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో సరికొత్త సవాల్ కు సిద్దమైంది. ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు (కేటీఆర్) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణకు హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కొనసాగింపుగా కేటీఆర్ పుట్టిన రోజు నాడు, ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ నెల 24న ఉదయం పది గంటలకు ప్రారంభించి ఒక్క గంటలో మూడు కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటనున్నారు. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం బ్రోచర్ ను మంత్రులు మహమూద్ అలీ, జీ. జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సీహెచ్. మల్లారెడ్డి, ఎంపీ కేశవ రావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, శానంపూడి సైది రెడ్డి, టీఆర్ ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో తెలంగాణ అభివృద్ది, సంక్షేమంలో తన వంతు పాత్ర పోషిస్తున్న యువ నాయకుడు కేటీఆర్ పుట్టిన రోజు నాడు ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నామని, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముక్కోటి వృక్షార్చన విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చన మాదిరిగానే ప్రతీ ఒక్కరూ ఈ మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో తమ వంతుగా పాల్గొన్ని ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు.

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించే హరిత పండగ వేదిక అవుతుందని బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు ఆకాంక్షించారు. ఎప్పటి కప్పుడు వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్‌ను, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులను ఎంపీ కే. కేశవరావు అభినందించారు.

- Advertisement -