రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కోవిడ్ కంట్రోల్ రూమ్ తిరిగి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ నగర పారిశుధ్య కార్యక్రమాల మీద ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష జరిపారు. ఈ సమీక్షకు జోనల్, డిప్యూటీ కమిషనర్, ఏ.ఎం.హెచ్.ఓ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ…నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను సహించేది లేదన్న ఆయన మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్ ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అంటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలన్నారు.
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ పై నిర్లక్ష్యం వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనన్న ఆయన నగరంలో బాధ్యతారహితంగా రహదారులపై చెత్తవేసేవారిని గుర్తించి జరిమానా విధించాలన్నారు. జీహెచ్ఎంసీ లో 24/7 ఈ కంట్రోల్ రూం పనిచేసే విధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్ తో పనిచేసిన విధంగా ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు.