రోడ్లపైకి వచ్చి అన్నదానాలు, నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం వలన లాక్‌డౌన్ సంకల్పం దెబ్బతింటున్నదని జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం వలన కరోనా వైరస్ సోకే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు, కార్పొరేటర్లు అర్థం చేసుకోవాలని కోరారు. ఈ నెల 21 నుండి భోజనం, నిత్యవసరాలను పంపిణీ చేయాలనుకునే స్వచ్ఛంద సంస్థలు, దాతలు తప్పనిసరిగా జిహెచ్‌ఎంసి, పోలీసు అధికారులకు సమాచారం ఇస్తే, వారే వాటిని సేకరించి అవసరమైన నిరుపేదలకు, యాచకులకు, వలస కార్మికులకు అందజేస్తారని తెలిపారు.
అన్నదానం, నిత్యవసరాలు పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు, దాతలకు జారీచేసిన పాస్‌లు ఇక నుండి చెల్లవని ప్రకటించారు. కార్పొరేటర్లు కూడా అధికారులకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపైన పంపిణీ చేయడం వలన నిరుపేదలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వారు కూడా రావడంతో రద్దీ ఏర్పడి సామాజిక దూరం నిబంధన అమలు కావడంలేదని అభిప్రాయపడ్డారు. తద్వారా తెలియకుండానే కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాసితులు, అనాథలు, యాచకుల సంరక్షణకై జిహెచ్‌ఎంసి ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 షెల్టర్ హోంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ షెల్టర్ హోంలలో 1,428 మందికి ప్రస్తుతం ఆశ్రయం కల్పించి, అన్నపూర్ణ పథకం ద్వారా ఉచిత భోజనాన్ని పెడుతున్నట్లు తెలిపారు. అయితే స్వచ్ఛంద సంస్థలు, దాతలు భోజనం, ఇతర నిత్యవసరాలను ఇవ్వాలనుకుంటే ముందస్తుగా షెల్టర్ హోంలలో ఉన్న వారికి అధికారుల ద్వారా అందజేయాలని సూచించారు. ఇంకను రోడ్లపైన వివిధ ప్రాంతాల్లో ఉన్న యాచకులను గుర్తించి షెల్టర్ హోంలకు తరలించుటకై జిహెచ్‌ఎంసి ద్వారా చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.