గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల నీటి నిల్వలు ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యే 160 ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం, సెంటర్ ఫర్ వాటర్ రిసోర్స్ విభాగాల సేవలను పొందాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు నేడు ఈ రెండు విభాగాల ప్రొఫెసర్లు లక్ష్మణ్‌రావు, ప్రొఫెసర్ గిరిదర్‌లతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హరిచందన, నిర్వహణ విభాగం చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్,సూపరింటెండెంట్ ఇంజనీర్లు హాజరైయ్యారు.
కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో 160 ప్రాంతాల్లో నీటి నిల్వలు చేరుకొని ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో సమస్యల తీవ్రతను తగ్గించడానికి స్వల్ప, మద్యంతర, దీర్ఘకాలిక పరిష్కారం సూచించాలని జె.ఎన్.టి.యు ప్రొఫెసర్లను కోరామని తెలిపారు. దీనిలో భాగంగా బుధ, గురువారాల్లో ఈ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలను జె.ఎన్.టి.యు ప్రొఫెసర్లు వ్యక్తిగతంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచిస్తారని తెలిపారు. నగరంలో 3 సెంటిమీటర్ల కన్నా అధిక వర్షం వస్తే ప్రస్తుతం ఉన్న డ్రెయిన్లు తట్టుకునే పరిస్థితిలేదని అన్నారు.
ముఖ్యంగా ఈ 160 సమస్యాత్మక ప్రాంతాల్లో 30 స్థానాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా ఏ కేటగిరిగా విభజించామని పేర్కొన్నారు. మొదటి దశలో ఈ 30 అత్యంత సమస్యాత్మక ముంపు ప్రాంతాల్లో వెంటనే చేపట్టాల్సిన చర్యలపై జె.ఎన్.టి.యు ప్రొఫెసర్లు సూచిస్తారని అన్నారు. ముఖ్యంగా ఈ 30 సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంజక్షన్ బోరుబావుల ఏర్పాటు, క్రాస్ డ్రెయిన్ల నిర్మాణం, సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, తాత్కాలిక హోస్ పైపుల ఏర్పాటు తదితర ప్రత్యామ్నయలను జె.ఎన్.టి.యు ప్రొఫెసర్లు సూచించారని పేర్కొన్నారు. రేపు ఎల్లుండి జీహెచ్ఎంసీ ఇంజనీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అద్యయనం చేస్తారని, తిరిగి శుక్రవారం నాడు సమావేశం కానున్నట్టు దానకిషోర్ వివరించారు.
ప్రాథమికంగా 15 ప్రాంతాల్లో ఇంజక్షన్ బోర్‌వెల్, క్రాస్ డ్రెయిన్ల నిర్మాణం, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణాలను చేపట్టనున్నామని తెలిపారు. వెంటనే మరో 15 ప్రాంతాల్లో కూడా ఈ చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. నగరంలో భూగర్బజలాల మట్టం గణనీయంగా పడిపోయినందున శేరిలింగంపల్లి జోన్‌లోని ఐటి కంపెనీలతో పాటు ఇతర మేజర్ కంపెనీలు తమ కంపెనీలలో ఉన్న ఖాళీ స్థలాల్లో పర్కులేషన్ ట్యాంక్‌లను నిర్మించుకోవాలని కమిషనర్ సూచించారు. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీ వర్షాల సందర్భంగా నీటి నిల్వ ఏర్పడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఎదురవుతున్నందున ఈ ప్రాంతంలో తగు ప్రత్యామ్నయ చర్యలు వెంటనే చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.