ఐటీ,పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. మరొక అంతర్జాతీయ సంస్థ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ నుంచి పిలుపు అందింది. జర్మనీలోని హాంబర్గ్‌లో మార్చి 2వ తేదీన జరుగనున్న ఈ సమావేశంలో పాల్గొని తెలంగాణలో గల అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని సంస్థ కోరింది.
ఆసియా దేశాలతో జర్మనీ నిర్వహించే వ్యాపార, వాణిజ్య అవకాశాలను చర్చించే ఈ సమావేశానికి అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయనాయకులు, దౌత్యవేత్తలు హాజరవుతారని అసోసియేషన్ తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మూడేండ్లుగా అమలుచేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలపై జర్మన్ వ్యాపారవర్గాలకు ఆసక్తి ఉన్నదని, అందుకే తమ దేశంలోని అగ్రస్థాయి వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా ఒక రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వివరించింది.
దీనికి ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్‌ను అసోసియేషన్ కోరింది. ఈ సమావేశంతో తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్యబంధం మరింత విస్తృతం అవుతుందని అసోసియేషన్ అశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణలో వ్యాపారావకాశాల గురించి జర్మనీకి చెందిన వాణిజ్యసంఘం ఆసక్తి వ్యక్తంచేయడం, తనను ప్రత్యేకించి సమావేశానికి ఆహ్వానించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.