వరంగల్‌లో జెన్‌పాక్ట్ టెక్‌ సెంటర్.. కేటీఆర్​ హర్షం..

40

తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర పరిశ్రమల,ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందువచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మరో సంస్థ చేరింది. వరంగల్‌లో టెక్‌ సెంటర్ ఏర్పాటుకు జెన్‌పాక్ట్ సంస్థ ముందుకు వచ్చింది.

వరంగల్‌కు ఐటీ కంపెనీలు వరుస కడుతున్నాయి. తాజాగా వరంగల్‌లో టెక్‌ సెంటర్ ఏర్పాటుకు యూఎస్​కు చెందిన ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ త్యాగరాజన్​.. మంత్రి కేటీఆర్​తో వర్చువల్​గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైయంట్​, టెక్​ మహీంద్ర కంపెనీలు వరంగల్​ నుంచి ఆపరేట్​ చేస్తుండగా… వీటి సరసన జెన్​పాక్ట్​ చేరనుంది.

వచ్చే ఆరునెలల్లో వరంగల్​లో ఈ టెక్​ సెంటర్​ సేవలను ఆరంభిస్తుందని.. తద్వారా వరంగల్​లో 250 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ సీఈవో త్యాగరాజన్​ మంత్రి కేటీఆర్​కు తెలిపారు. జెన్‌పాక్ట్ ప్రకటనపై మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం అవుతుందని మంత్రి ట్వీట్​ చేశారు.