యూరియా తయారీ పరిశ్రమపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్–ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఎనర్జీ సరఫరాలపై ప్రభావం చూపడంతో భారతదేశంలో కూడా యూరియా ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. యూరియా తయారీలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ప్రధాన ముడి పదార్థం కావడంతో గ్యాస్ లభ్యత తగ్గిపోవడం పరిశ్రమలకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం దేశంలోని యూరియా ప్లాంట్లు తమ పూర్తి సామర్థ్యంతో కాకుండా కేవలం సుమారు 60 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే నెలల్లో దేశంలో యూరియా సరఫరా సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో టన్నుకు సుమారు 475 డాలర్లుగా ఉన్న యూరియా ధర ఇప్పుడు 25 శాతానికి పైగా పెరిగి దాదాపు 600 డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావం దిగుమతుల ఖర్చుపై పడే అవకాశం ఉంది.
ఇక గల్ఫ్ దేశాలలో గ్యాస్ సరఫరా సమస్యల కారణంగా కొన్ని ప్లాంట్లు తాత్కాలికంగా మూతపడినట్లు సమాచారం. అవి తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత మాత్రమే గ్లోబల్ సరఫరా పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పరిస్థితి త్వరగా సర్దుబాటు కాకపోతే వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం పడే అవకాశాన్ని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.
Also Read:సత్యవతిగా రీతు!

