హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమైంది. తెల్లవారు జామునే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక ట్రాలీపైకి గణేషుడిని చేర్చిన నిర్వాహకులు తెల్లవారుజామునే అవసరమైన వెల్డింగ్ పనులను పూర్తిచేసి శోభాయాత్రకు సిద్ధం చేశారు. మరోవైపు, వినాయకుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మొత్తం 17 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. బాలాపూర్ గణేషుడి ఊరేగింపు కూడా ఈ ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం బాలాపూర్ చౌరస్తాలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. కాగా, నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులకు జీహెచ్ఎంసీ మాస్కులు పంపిణీ చేస్తోంది.
ఇక నిమజ్జనం జరిగే సమయంలో మున్సిపల్ కార్పోరేషన్ తరుఫున 8,700 మంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. నేటి నిమజ్జన కార్యక్రమంలో సుమారు 40 వేల విగ్రహాలు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు.